Wednesday, February 18, 2026
Homeమెదక్‌Edupayala | బండెనక బండి కట్టి… దుర్గమ్మ పేరు తలచి…

Edupayala | బండెనక బండి కట్టి… దుర్గమ్మ పేరు తలచి…

  • వైభవంగా ఏడుపాయల జాతర ఉత్సవాలు
  • అమ్మవారికి ఘనంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు
  • భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు ఏడుపాయల
  • బండ్లు, బోనాలు ఇక్కడి ప్రత్యేకత
  • నేడు రథోత్సవం

జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన చోట వెలసిన వనదుర్గా మాత దేవాలయం ఏడుపాయల వద్ద మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రంగురంగుల కాంతులతో ప్రకాశిస్తున్న దేవస్థానం పరిసరాలు దుర్గమ్మ నామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తి, సంప్రదాయం సంస్కృతిల సమ్మేళనం ఏడుపాయల జాతర. రెండవ రోజు అయిన సోమవారం దుర్గామాతకు ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

పాపన్నపేట నుంచి రాణి శంకరమ్మ సంస్థానాధీశుల తరపున మొదటి బండి, అనంతరం నాగసాన్ పల్లి, శేరిపల్లి, అన్నారం, అబ్లాపూర్, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు ఊరేగింపులో పాల్గొన్నాయి. యువత కేరింతల నడుమ ఊరేగింపు జరగ్గా ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జాతర మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులు రావడంతో వనమంతా జనంతో నిండిపోయింది.

- Advertisement -

ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య బోనమెత్తి చేసిన నృత్యాల కోలాహలంతో భక్తులు పులకించిపోయారు. బండ్ల ఊరేగింపు, బోనాల సమర్పణ ఇక్కడి ప్రత్యేకత. భక్తులు అనేక సంఖ్యలో మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ఉన్న సంతాన గుండంలో దంపతులు స్నానమాచరిస్తే సంతానం కలుగుతుందని ఆనాదిగా వస్తున్న విశ్వాసంతో నూతన దంపతులు సంతాన గుండంలో స్నానమాచరించారు.

శివరాత్రి రోజు భక్తుల సంఖ్య తక్కువగా కనిపించినా సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం రథోత్సవంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. దేవాదాయ, పంచాయతీరాజ్, పోలీసు శాఖతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్య శాఖ , ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అద్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు.

వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడిపిస్తోంది. శాంతిభద్రతలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, ఈఓ వీరేశం లు ఎప్పటికప్పుడు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News