తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు (Educational institutions) సమ్మెకు సై అంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement) బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్ చేస్తూ.. నవంబర్ 3 నుంచి రాష్ట్రంలోని కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయించింది. ఇందుకోసం భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించిన సమాఖ్య, ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ (General Body Meeting) నిర్వహించింది. ప్రభుత్వాన్ని పెండింగ్ బకాయిలు విడుదల చేయమంటే కాలేజీల్లో తనిఖీలు (Inspections in colleges) గుర్తుకు వస్తున్నాయని విద్యాసంస్థల సమాఖ్య మండిపడింది.
ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు దసరాకి 600 కోట్లు ఇస్తామని చెప్పి 200 కోట్లు మాత్రమే ఇచ్చిందని, దీపావళి నాటికి 1200 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం… ఇప్పటికీ వాటి గురించి ఎలాంటి కదలిక లేదని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సమాఖ్య ప్రతినిధులు ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలని నిర్ణయించారు. నవంబర్ మొదటి వారంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బందితో ‘చలో హైదరాబాద్’తోపాటు, భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని.. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎడ్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న 15 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఎక్కువ మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నారని అన్నారు. వారంతా సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది.
