- భారతీయుల నెత్తిన ట్రంప్ మరో పిడుగు
- ఏటా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు
- వీసా, రెన్యువల్ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే
- నేటినుంచే అమల్లోకి వీసా పెంపు నిబంధనలు
- అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్ల కోసమే హెచ్1బీ
- గతంలో 1,500 డాలర్లు మాత్రమే వీసా ఫీజు
- ట్రంప్ ఆర్డర్తో చాలా మంది ఇంటి బాట
- సమర్థించిన అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి భారత్కు షాక్ మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్… తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు. హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఉత్తర్వు ప్రకారం ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిఉంటుంది. అమెరికాలో హెచ్1బీ వీసాపై పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉంటారు. చైనీయులు 11.7 శాతం మంది ఉంటారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునే వీలు కల్పిస్తూ 1990లో హెచ్1బీ వీసాను తీసుకొచ్చారు. ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతోమంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించారు. హెచ్1బీ వీసాదారులకు లాటరీ విధానం ఉంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసేందుకు ముందుగా సాధారణ ఛార్జీలు చెల్లించాలి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఏడాదికి 85 వేల వీసాలను అమెరికా లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగుల హెచ్1బీ వీసా ఛార్జీలను చెల్లిస్తుంటాయి.
అయితే ప్రస్తుతం ఆ ఫీజును భారీగా పెంచేయడంతో కంపెనీలు పెను భారాన్ని ఎదుర్కోక తప్పదు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు నిజంగానే ఇది పిడుగులాంటి వార్త. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్ తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండని లుట్నిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా తీసుకొచ్చారు. హెచ్-1 బి వీసాలను మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మరోవైపు గోల్కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు.
దీనికి 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్కేర్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనికిరాని వ్యక్తులు అమెరికా రావొద్దని, హెచ్1బీ అప్లికేషన్ ఫీజు పెంచే సమయంలో ఘాటు విమర్శలు చేశారు. ఐటి కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని, పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందేనని హోవర్డ్ స్పష్టం చేశారు. హెచ్1బి వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువగా భారతీయులే ఉండడంతో హోవర్డ్ వ్యాఖ్యలు వారినే అవమానించే విధంగా ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
