- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటి, జిల్లా పేరును నిలబెట్టారని, కలెక్టర్ అభిలాష అభినవ్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, సీఎం కప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా క్రీడాకారులు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని అన్నారు.

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లాకు 4 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు కలిపి మొత్తం, 25 పతకాలు వచ్చాయని తెలిపారు. ఈ ఫలితాలు జిల్లా క్రీడాకారుల అద్భుత ప్రతిభకు కొలమానమని పేర్కొన్నారు. ఇందుకు గానూ, యువజన క్రీడల శాఖ అధికారులకు, కోచ్ లకు, ఉపాధ్యాయులకు, క్రీడల్లో ప్రోత్సహించినందుకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఈవో భోజన్న, సిపిఓ జీవరత్నం, కోచ్ లు, తదితరులు పాల్గొన్నారు.
