Thursday, March 5, 2026
Homeఆదిలాబాద్Inspection | కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Inspection | కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న ’99 రోజుల ప్రత్యేక ప్రణాళిక’ క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న కలెక్టర్, విద్యార్థులతో కలిసి ఉదయపు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని మెస్ నిర్వహణను పరిశీలించి, విద్యార్థులకు వడ్డిస్తున్న అల్పాహారం నాణ్యతను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి, వారికి అందుతున్న వసతులు, విద్యా బోధన, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ రాజు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News