మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గడ్డుకాలమా?
బీజేపీ-బీఆర్ఎస్ జతకట్టే అవకాశాలపై ఊహాగానాలు!
పట్టణ రాజకీయాల్లో కొత్త లెక్క
బీజేపీ-బీఆర్ఎస్ కలయికపై చర్చ!
వికారాబాద్ ఎన్నికల సమరంలో అనూహ్య మలుపు?
బీజేపీ-బీఆర్ఎస్ రహస్య వ్యూహాలు నిజమేనా?
బీజేపీ-బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తారన్న ప్రచారం.!
మునిసిపల్ బరిలో బీజేపీ-బీఆర్ఎస్ స్నేహం నిజమేనా?
వికారాబాద్ మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy)!, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ మునిసిపల్ కాంగ్రెస్ నాయకులు మాజీ సబితా ఇంద్రారెడ్డి వర్గమేనా?
వికారాబాద్ జిల్లా కేంద్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం!
వికారాబాద్, ఆదాబ్ హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రం(Vikarabad District)లో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకుల్లో (Congress Party Leaders) అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ బలహీనపడ్డట్టు కనబడుతోంది. మునిసిపల్ ఎన్నికల్లో(Municipal Elections) కలిసికట్టుగా ముందుకుపోవాలన్న వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు లేక, ఉన్న నాయకుల మధ్య విభేదాలతో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పిందనే చర్చ కొనసాగుతోంది. మునిసిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పార్టీ నాయకులు ముందుకు కదులుతున్నప్పటికీ ప్రజల నుంచి గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ్లెక్సీల గొడవ, మాటల యుద్ధం, కాంగ్రెస్‌లో కుమ్ములాట వల్ల ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయాల్లో మరో కీలక మలుపుగా రానున్న మునిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్షగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గడ్డుకాలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపాలు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి.
పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనత
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పట్టణ రాజకీయాల్లో అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ పరిధిలో స్థానిక నాయకత్వం బలహీనంగా ఉండటం, క్యాడర్ యాక్టివ్‌గా లేకపోవడం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కనబడుతోంది. అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు వేగంగా సాగకపోవడం, వికారాబాద్ పట్టణంలో డ్రైనేజీ, రోడ్లు, ఇతర సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ ఏమాత్రం ముగ్గు చూపలేదని వికారాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు స్పష్టంగా కనిపించకపోవడం కాంగ్రెస్‌పై అసంతృప్తిని పెంచుతోంది.
జిల్లా నాయకత్వం లేకపోయినా బీజేపీ దూకుడు
పట్టణ ప్రాంతాల్లో బలపడే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి ఉన్న బలం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ చూపుతున్న చురుకుదనం మునిసిపల్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. పట్టణ మధ్యతరగతి, యువతలో బీజేపీకి ఆదరణ కనిపిస్తోంది. జిల్లా నాయకత్వం లేకపోయినప్పటికీ బీజేపీ నాయకుల పట్టుదలతో ముందుకు సాగే అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకుపోతే కాంగ్రెస్‌కు ఆందోళనే అనే చర్చ సాగుతోంది.
ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేలా బీఆర్ఎస్ ప్రచారాలు!
వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పునరాగమనం వ్యూహం, అధికారాన్ని కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయంగా బలహీనపడలేదనే చెప్పాలి. మునిసిపల్ స్థాయిలో బీఆర్ఎస్‌కు ఇంకా బలమైన నెట్‌వర్క్ ఉంది. గతంలో మునిసిపాలిటీల్లో కొనసాగిన అనుభవం, స్థానిక నాయకుల పట్టు, బలం బీఆర్ఎస్‌కు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి.
బీజేపీ-బీఆర్ఎస్ జతకట్టే అవకాశాలు?
బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు అంశం వికారాబాద్ మునిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ మునిపల్ ఎన్నికలు వంటి స్థానిక స్థాయిలో వ్యూహాత్మకంగా అవగాహనకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఉమ్మడి లక్ష్యంతో మునిసిపాలిటీల్లో పరోక్ష సహకారం లేదా అవగాహన ఉండొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
త్రికోణ పోటీ-కాంగ్రెస్‌కు ప్రమాద ఘంటికలు
బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరుగా పోటీ చేసినా.. కొన్ని చోట్ల కలిసి ముందుకు వచ్చినా.. త్రికోణ పోటీ కాంగ్రెస్‌కు మరింత నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఓటు చీలిక, అసంతృప్తి ఓటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారాయి. టికెట్ల పంపిణీ నుంచి స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు వరకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కలిసొచ్చి మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముగింపు మొత్తంగా చూస్తే రాబోయే మునిసిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. కాంగ్రెస్‌కు ఇది గట్టి పరీక్ష కాగా బీజేపీ తన పట్టణ బలాన్ని విస్తరించుకునే అవకాశంగా భావిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలను రాజకీయ పునరాగమనానికి వేదికగా మలచుకోవాలని చూస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య జతకట్టే అవకాశం నిజమైతే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు మరింత గడ్డుకాలంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎంపీ ఎన్నికల్లో ఏం జరిగింది
చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీకి ఓటు బ్యాంకు లేనప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి పోటీగా గడ్డం రంజిత్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన గడ్డం రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందనే ఆశలు పెట్టుకున్నా పరాజయం తప్పలేదు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు లేకపోయినా ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఎంపీ ఎన్నికలు జరిగినట్లే మునిసిపల్ ఎన్నికల్లో జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ నాయకులు జత కట్టకపోయినా ప్రజలు మాత్రం ఏకథాటిగా జతకట్టుకొని కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బకొట్టాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారనే చర్చ వికారాబాద్ జిల్లాలో జోరుగా సాగుతోంది.

