- శ్రీశ్రీశ్రీ జ్ఞాన లింగేశ్వర స్వామి భవాని సమేత శివాలయంలో ఆధ్యాత్మిక వెల్లువ.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చివ్వెంల శ్రీశ్రీశ్రీ జ్ఞాన లింగేశ్వర స్వామి భవాని సమేత శివాలయంతో పాటు,తిమ్మాపురం, దురాజ్ పల్లి లోని పెద్దగట్టు, కుడ కుడ లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజామున నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా “ఓం నమశ్శివాయ” నామస్మరణతో మారుమోగింది.
ప్రభాతకాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతంతో లింగాభిషేకం తో స్వయంగా భక్తులు తమ చేతులతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మహిళలు దీపారాధన చేసి శివపార్వతులను మొక్కుకున్నారు.రోజంతా భక్తుల రద్దీ కొనసాగింది. క్యూలైన్ లో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు కొబ్బరికాయలు, బిల్వదళాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

రాత్రి జాగరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శివనామసంకీర్తనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. రాత్రి 12 గంటలకు నిర్వహించిన లింగోద్భవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలు ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు సేవలందిస్తున్నారు.స్వామివారి దర్శనం కోసం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
గ్రామానికి చెందిన కొణతం అప్పిరెడ్డి కూతురు అల్లుడు సునీల్ రెడ్డి మానస, స్వామి వారికి వేడి కండ్లు, నామాలు, మీసాలు బహూకరించారు. అలాగే వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన మరొక భక్తుడు కూడా స్వామివారికి వెండి కండ్లు, మీసాలు బహూకరించారు. మరికొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలోకి కూర్చోడానికి సిమెంట్ బెంచీలు బహుకరణగా ప్రకటించారు. భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ శివరాత్రి వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్ముతున్నాయి.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
