ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో కలిసి అడుగులు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతం: జర్మనీ పార్లమెంట్ బృందం
ప్రజాభవన్‌లో జర్మనీ (Germany) పార్లమెంట్ (Parliament) (బుండెస్టాగ్) బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘జర్మనీ-ఇండియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని తెలంగాణ రాష్ట్రం (Telangana State) మరింత గాఢంగా నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఐటీ, డిఫెన్స్, ఫార్మా, మెటలర్జీ, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో జర్మనీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం, వేగవంతమైన అనుమతులు అందిస్తుంది. నైపుణ్యం కలిగిన తెలంగాణ యువతను జర్మనీకి పంపేందుకు, అక్కడి సాంకేతికతను ఇక్కడికి తీసుకొచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించే అంతర్జాతీయ స్కిల్ యూనివర్సిటీలో జర్మన్ భాషా విభాగం ఏర్పాటు చేసి, తెలంగాణ విద్యార్థులు జర్మనీలో ఉద్యోగ, ఉన్నత విద్య అవకాశాలు పొందేలా చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవనం, వ్యవసాయ ఆధారిత రంగ అభివృద్ధి, హైదరాబాద్ ఐటీ హబ్ విస్తరణ వంటి కీలక అంశాల్లో కూడా జర్మనీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు. ఈ భేటీలో జర్మనీలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన MPs నేతృత్వంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు, జర్మన్ బుందెస్టాగ్ అధికారులు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇందన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో CMD కృష్ణ భాస్కర్, జెన్‌కో CMD హరీష్, ప్రణాళిక శాఖ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ డా. నర్సింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.
