దంతాల ఆరోగ్యం శరీరానికి చాలా ముఖ్యం. మన దేశంలో దంత సంబంధ సమస్యలు(Dental Problems) ఏటా పెరుగుతున్నాయి. అయితే.. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు (Solutions) కూడా ఉన్నాయి. సాంప్రదాయిక (Traditional), ఆధునిక (Modern) పద్ధతుల మధ్య సమన్వయం ద్వారా వీటిని సాధించొచ్చు. 2025లో ఇండియాలోని దంతాల ఆరోగ్య మార్కెట్ (Oral Care Market) మొత్తం విలువ 1.96 బిలియన్ డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే.. సుమారు 16,400 కోట్లు.
ఇది 7.9 శాతం వార్షిక వృద్ధి రేట్(CAGR)తో దూసుకెళుతోంది. ఈ మార్కెట్ 2030 నాటికి 3.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కానీ.. దేశవ్యాప్తంగా దంతాల ఆరోగ్య స్కోర్ (Oral Health Care) కేవలం 2.6/5 మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. 64 శాతం మందిలో పళ్లపై మచ్చలు పడుతున్నాయి. 48 శాతం మందికి పల్పలు దెబ్బతింటున్నాయి. 46 శాతం మందికి పళ్ల ధరణం(అట్రిషన్) తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో.. పురాతన, తాజా పరిశోధనల ఆధారంగా దంతాల శుభ్రతా పద్ధతులను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
సాంప్రదాయిక దంతాల శుభ్రతా పద్ధతులు:
భారతీయ సంస్కృతిలో దంతాల శుభ్రత పురాతన కాలం నుంచి ప్రకృతి సంబంధిత విధానాలతో ముడిపడి ఉంది. ఆధునిక టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌లు లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బొగ్గు, ఉప్పు, వేప పుల్లలను ఉపయోగించేవారు. ఈ పద్ధతులు ఇప్పటికీ గ్రామీణ భారతంలో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. తాజా పరిశోధనలు సైతం వాటి ప్రయోజనాలను ధృవీకరిస్తున్నాయి.
బొగ్గు(చార్‌కోల్):
కట్టెల పొయ్యి నుంచి వచ్చే బొగ్గును పొడిగా చేసి పళ్లు తోముకోవడం చాలా సాధారణంగా కనిపించే పద్ధతి. ఇది అబ్రాసివ్ గుణాలు కలిగి ఉండటం వల్ల పళ్లపై ఉండే ప్లాక్, పాచి, మురికిని తొలగిస్తుంది. ఫలితంగా పళ్లు తెల్లగా కనిపిస్తాయి. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. చార్‌కోల్‌ను కలిగి ఉండే ఆధునిక టూత్‌పేస్ట్.. కాఫీ వల్ల ఏర్పడే స్టెయిన్లను కొంత వరకు తగ్గిస్తుంది.
కానీ.. పూర్తిగా తొలగించలేకపోతోంది. అయితే.. దీన్ని అధికంగా ఉపయోగించడం వల్ల పళ్ల ఎనామెల్ దెబ్బతింటుంది. డెంటిన్ బహిర్గతం కావడం, సున్నితత్వం(హైపర్‌సెన్సిటివిటీ) వంటి సమస్యలకు దారితీస్తుంది. హార్వర్డ్ హెల్త్ 2024 నవంబర్ నివేదిక ప్రకారం.. చార్‌కోల్ టూత్‌పేస్ట్‌ను రోజూ వాడటం మంచిది కాదు. ఎందుకంటే ఇది అత్యంత ఘర్షణకరమైంది. అదనంగా.. ఇందులో ఫ్లోరైడ్ లేకపోవడం వల్ల క్యావిటీల ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఉప్పు (సాల్ట్):
పాతకాలంలో దొడ్డుప్పును పొడిగా చేసి, బొగ్గుతో కలిపి పళ్లు తోమేవారు. ఉప్పులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పళ్లలోని హానికర బ్యాక్టీరియాను తొలగించి మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. గింగివా(పళ్ల చుట్టూ ఉండే మృదువైన కణజాలం)లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. పళ్ల ఎనామెల్‌కు అవసరమైన ఖనిజాలను తిరిగి చేరుస్తూ దాని రక్షణలోనూ సహాయపడుతుంది.
2025లో గెలాక్సీ డెంటల్ క్లినిక్ చేసిన పరిశోధనలో.. ఉప్పు నీటితో పుక్కిలించడం(రిన్సింగ్) వల్ల దుర్వాసన, గమ్ తదితర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని తేలింది. అయితే.. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఉప్పుతో పళ్లు నేరుగా తోమడం డెంటిన్‌కు హాని చేస్తూ దాని వియర్‌ను పెంచుతుంది. పళ్లను తెల్లగా చేయడంలో దీని ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్థారించలేదు. కాబట్టి.. ఉప్పును బ్రష్ చేసుకోవడానికి కాకుండా కేవలం నోరు పుక్కిలించి ఉమ్మడానికి, పళ్లను శుభ్రం చేసుకోడానికి మాత్రమే ఉపయోగించడం మంచిది.
వేప పుల్లలు:
వేప పుల్లలతో పళ్లు తోముకోవడం అనేది సహజ దంత సంరక్షణకు పాతకాలపు మార్గం. అంతేగాక.. వేప చెట్టు కొమ్మలను చూర్ణం చేసి పళ్లు తోమడం కూడా ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన పద్ధతి. వేపలోని యాంటీమైక్రోబయల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఫంగల్ గుణాలు.. ప్లాక్, గమ్ ఇన్ఫెక్షన్లను, క్యారీస్‌ను నివారించడంలో సహాయపడతాయి.
2025 ఫిబ్రవరిలో స్ప్రింగర్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. వేప వంటి హెర్బల్ రెమెడీస్ యాంటీక్యాన్సర్, యాంటీక్యారీస్, యానల్జెసిక్ గుణాలను కలిగి ఉంటాయని నిర్థారణ అయింది. 2024 జూన్‌లో పెర్ఫోరా చేసిన అధ్యయనం ప్రకారం.. వేప ఆధారిత ఆధునిక టూత్‌పేస్ట్.. ప్లాక్‌ను తగ్గించి, క్యావిటీలను, గమ్ డిసీజ్‌లను నిరోధించడంలో సమర్థంగా పనిచేస్తోంది.
వేప పుల్లల చేదు రుచి కారణంగా కొందరికి దీన్ని రోజూ ఉపయోగించడం కష్టం. అధిక మోతాదులో వేప ఉత్పత్తులను ఉపయోగించడం ఒక్కోసారి జీర్ణ సమస్యలకూ దారితీయొచ్చు. నిజానికి.. సాంప్రదాయ పద్ధతుల్లో ఖర్చు తక్కువ. అంతేగాక.. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. సహజమైనవి. అయితే.. మురికిగా ఉన్న బొగ్గు లేదా అనియంత్రితంగా తీసిన వేప పుల్లలు ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.
ఆధునిక దంత ఉత్పత్తులు:
20వ శతాబ్దం మధ్యకాలంలో మార్కెట్‌లోకి దంత పొడులు (టూత్ పౌడర్), పేస్ట్‌లు ప్రవేశించాయి. మొదట్లో.. ఫారుకీ దంత మంజన్ తదితర హెర్బల్ పౌడర్‌లు వచ్చాయి. తర్వాత.. కోల్గేట్ టూత్ పౌడర్, పేస్ట్‌లు కూడా పరిచయమయ్యాయి. ఇవి.. ఫ్లోరైడ్, మెంథాల్, సింథటిక్ ఇన్‌గ్రిడియెంట్స్‌తో పళ్ల రక్షణ, రుచిని మెరుగుపరిచాయి.
బినాకా, సిబాకా, పెప్సోడెంట్ వంటి బ్రాండ్‌లు కూడా పోటీ పడ్డాయి. ఇంకా ఎన్నో రకాల టూత్ పౌడర్లు, పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. 2024లో మన దేశ టూత్‌పేస్ట్ మార్కెట్ 710.5 మిలియన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి ఇది 1,050.7 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐమార్క్ గ్రూప్ అంచనా.
2025లో దంత ఆరోగ్య సంరక్షణ.. సహజ ఇన్‌గ్రిడియెంట్స్ వైపు మొగ్గు చూపుతోంది. హెర్బల్ టూత్‌పేస్ట్ మార్కెట్ 2024లో 3.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2034 నాటికి 8.9 శాతం సీఏజీఆర్‌తో 8.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. మన దేశంలో ఆయుర్వేదిక్ టూత్‌పేస్ట్ మార్కెట్ 2025లో 1.40 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 14.29 శాతం సీఏజీఆర్‌తో 2.73 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది.
కోల్గేట్ వంటి కొన్ని బ్రాండ్‌లు చార్‌కోల్, ఉప్పు, వేపను యాడ్ చేసిన ప్రకటనలు ప్రచారం చేస్తున్నాయి. ప్రోబయాటిక్, హైడ్రాక్సీఅపటైట్, ఎంజైమ్-బేస్డ్ పేస్ట్‌లు.. ఫ్లోరైడ్-ఫ్రీ ఆప్షన్‌లుగా పాపులర్ అవుతున్నాయి. 2025లో నీమ్, టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. అంతేగాక.. ప్రభుత్వ చర్యలు, అవగాహన కార్యక్రమాల ద్వారా ముందస్తు దంత సంరక్షణపై అందరూ దృష్టి పెడుతున్నారు.
ప్రయోజనాలు, నష్టాలు:
సాంప్రదాయిక పద్ధతులు సహజమైనవి. యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో ప్రభావశీలమైనవి. కానీ.. అబ్రాసివ్ గుణాల వల్ల పళ్ల ఎనామెల్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ముప్పు కూడా ఉంటుంది. ఉదాహరణకు.. వేప జెల్ క్లోర్‌హెక్సిడిన్‌తో సమానంగా ప్లాక్, గింగివైటిస్‌ను తగ్గిస్తుంది. కానీ.. ఆధునిక పేస్ట్‌లు ఫ్లోరైడ్‌తో క్యావిటీ సంరక్షణను(ప్రివెన్షన్) అందిస్తాయి.
హెర్బల్ ఇన్‌గ్రిడియెంట్స్‌ను రక్షణాత్మక ఫార్ములేషన్‌లలో సమన్వయం చేస్తూ 2025లో హైబ్రిడ్ విధానంలో దంత సంరక్షణ విషయమై ముందుకు వెళ్లడం జరుగుతోంది. మన దేశంలో దంత చికిత్సా సేవలు పరిమితంగా ఉన్నందున ఈ హైబ్రిడ్ విధాన మార్గాలు ఆర్థిక భారాన్ని తగ్గించగలవు. అయితే.. డెంటిస్ట్ సలహా లేకుండా సాంప్రదాయిక మార్గాలపై పూర్తిగా ఆధారపడటం మాత్రం తప్పే అవుతుంది.
మన దేశంలో దంత సంరక్షణ, ఆరోగ్యం.. సాంప్రదాయిక విధానాల నుంచి ఆధునిక శైలికి మారినప్పటికీ ఇప్పుడు (2025లో) ప్రకృతి సంబంధిత సహజ అంశాలే తిరిగి ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. డెంటిస్ట్ సలహాతో హైబ్రిడ్ అప్రోచ్‌ను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన పళ్లు, గమ్‌లను నిర్థారించుకోవచ్చు. ఇలాంటి మార్గాలు కేవలం దంతాల సంరక్షణ, శుభ్రతకు మాత్రమే కాక మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.
- అశోక్ గుంటుక
