Monday, October 27, 2025
ePaper
Homeకరీంనగర్DBS: పార్కిన్సన్ బాధితులకు 'డీబీఎస్' కొత్త చికిత్స

DBS: పార్కిన్సన్ బాధితులకు ‘డీబీఎస్’ కొత్త చికిత్స

మందులకు స్పందించని రోగులకు డీబీఎస్ చికిత్స అద్భుత ఫలితాలనిస్తోందని, ఇది రోగుల జీవన ప్రమాణాలను దీర్ఘకాలం పాటు మెరుగుపరుస్తుందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజేష్ అలుగోలు అన్నారు. కరీంనగర్‌లోని యశోద హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పార్కిన్సన్ వ్యాధి వేధిస్తోందని తెలిపారు. గతంలో వృద్ధుల్లోనే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. శరీర కదలికలను నియంత్రించే మెదడులోని భాగాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుందని ఫలితంగా చేతులు వణకడం, నడకలో ఇబ్బందులు, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయిని తెలిపారు. వ్యాధి ప్రారంభ దశలో మందులతో నియంత్రించినప్పటికీ, కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గుతుందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స ఆధారిత ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) చికిత్స కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ విధానంలో మెదడులోని నిర్దిష్ట భాగాల్లో ఎలక్ట్రోడ్లను అమర్చి, ఛాతీలో అమర్చిన చిన్న పరికరానికి అనుసంధానిస్తారని తెలిపారు. ఈ పరికరం పంపే విద్యుత్ సంకేతాలు మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తాయిని చెప్పారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్’ (ఎంఆర్ఎఫ్ యూఎస్) వంటి ఇతర చికిత్సా విధానాలు పరిమిత ప్రయోజనాలనే అందిస్తున్నాయని పేర్కొన్నారు. సరైన మందులు, వ్యాయామం, ఆధునిక చికిత్సలను సమన్వయం చేసుకుంటే పార్కిన్సన్ బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని సూచించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News