Thursday, April 2, 2026
Homeరంగారెడ్డిCPI | గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం వరకు పోరాటం

CPI | గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం వరకు పోరాటం

కాప్రా మండలంలోని గబ్బిలాల పేటలో కిరాయి గదుల్లో కొనసాగుతున్న ఎంపీపీ ఎస్ గబ్బిలాలపేట పాఠశాలను సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ ఆధ్వర్యంలో సిపిఐ బృందం సందర్శించింది. ఈ బృందంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పాఠశాల సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో 126 మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ కేవలం మూడు గదులు మాత్రమే ఉండటంతో బోధన సక్రమంగా సాగడం లేదని తెలిపారు. సుమారు 46 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల వారి వివరాలు ఆన్లైన్‌లో నమోదు కాక భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. జనన ధృవీకరణ పత్రాలు అందిస్తే ఆధార్ కార్డులు పొందేందుకు వీలవుతుందని రెవెన్యూ అధికారులను కోరాలని సిపిఐ నాయకత్వానికి వివరించారు.

- Advertisement -

ఈ పాఠశాలకు ప్రభుత్వం నాలుగు ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదని తెలిపారు. ఆ భూమిపై వెంటనే ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మిస్తే సమీప ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యం కలుగుతుందని, దూర ప్రాంతాలకు వెళ్లలేని విద్యార్థులు చదువు మానేయకుండా కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమస్యను గత అసెంబ్లీ సమావేశాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తావించినట్టు గుర్తు చేశారు.

మూడు లక్షల జనాభాకు కేవలం రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మాత్రమే ఉండడం దురదృష్టకరమని, ప్రభుత్వ విధానాల వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని విమర్శించారు. విద్యా కమిషన్ నివేదికను అమలు చేసి గబ్బిలాల పేటకు మరో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల నిర్మాణం పూర్తయ్యే వరకు మేధావులు, రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింహులు, మండల సహాయ కార్యదర్శి రాజేశ్వరి, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి స్వరూప, శాఖ కార్యదర్శి సత్యం, నాయకులు లత, నాని, లక్ష్మణ, వెంకటయ్య, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News