- దొడ్డి దారిన వచ్చి ఏళ్ల తరబడి తిష్ట వేసిన సీనియర్ అసిస్టెంట్.!
- ప్రతి పనికి పైకం చెల్లించాల్సిందే.. కిందిస్థాయి ఉద్యోగస్తులపై వివక్ష..!
- హాస్టల్ వార్డెన్ లకు మెమొల రూపంలో బ్లాక్ మెయిల్
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డిటిడిఓ) పని తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైళ్లు కదలాలి అంటే చేయి తడపాల్సిందేనని ఆ శాఖ ఉద్యోగులు గొల్లుమంటున్నారు. డి.టి.డి.ఓ అవినీతి మేత పట్ల ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయని సమాచారం. అయినా సరే సదరు అధికారి అందినకాడికి సొమ్ము దండుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు.

‘ఈసడింపు మాటలు’:
‘బర్రెలు కాసుకో పోయి! ఎవరిచ్చారు నీకు జాబ్..మా ఆఫీసులో నీకు ఏం పని ‘ అంటూ వెకిలి మాటలతో, డిటిడిఓ వార్డెన్లతో సహా పలువురు కింది స్థాయి సిబ్బందిపై కుల వివక్షత చూపిస్తూ, టార్గెట్ చేసుకుని మరీ వేధింపులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. సబర్డినేట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నియామకం చేయకపోవడం, గ్రేడ్ వన్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటూ, ముడుపులు ముట్ట జెప్పితేనే ఫైలు ముందుకు కదులుతుందనే ఆరోపణలు కూడా ఈ అధికారిపై ఉన్నాయి. డిటిడిఓ పరిధిలో ఉన్న హాస్టళ్లల్లో పనిచేసే 306 మంది వర్కర్లకు రూ.12 వేల నుంచి 15 వేల రూపాయలు జీతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నా కూడా సంవత్సరం కాలంగా వర్కర్లకు జీతాల పెంపు కోసం కలెక్టర్ ఇచ్చిన గెజిట్ ఫైల్ ను పక్కనపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, డిటిడిఓ కు సంబంధించిన ఒక దళారి ని మధ్యవర్తి గా పెట్టి మీ జీతాల ఫైలు ముందుకు కదలాలంటే 4 నుంచి 5 వేల రూపాయలు పెద్ద సారు జేబు తడపాలంటూ డిటిడిఓ కి దగ్గరి బంధువైన రాంనగర్ హాస్టల్లో వర్కర్ గా పనిచేసేటటువంటి వ్యక్తి ని పురమాయించాడని, ఈ వ్యక్తి అదే పనిలో నిమగ్నమై ఉన్నాడని విశ్వసనీయ సమాచారం.

‘సీనియర్ అసిస్టెంట్ దే హవా’! జిల్లా కార్యాలయంలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ పోస్టు లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు డి.టి.డి.ఓ కార్యాలయంలో మూడు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా పునర్విభజన తర్వాత కేడర్ స్ట్రెంత్ ప్రకారం రెండు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు సూర్యాపేట జిల్లా కు, మరొకటి యాదాద్రి భువనగిరి జిల్లా కు కేటాయించబడినాయి. దీంతో నల్గొండ డిటిడిఓ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ లేదనేది వాస్తవం. అయినప్పటికీ దొడ్డి దారిలో ఉన్నతాధికారుల కళ్ల కు గంతలు కట్టి ‘మాడా’ కార్యలయం పేరుతో 8 సంవత్సరాల నుంచి డిటిడిఓ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ గా తిష్టవేసిన వ్యక్తి అందినకాడికి దోచుకుంటున్నాడు. జి.ఓ.నెం.140 ప్రకారం డిటిడిఓ కార్యాలయంలో అసలు పోస్ట్ తరలిపోయినా సరే ‘010’ పద్దు కింద వేతనం పొందుతున్నా కూడ ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది. గిరిజన శాఖ రెవెన్యూ శాఖ మధ్య ఉన్న అక్రమ లావాదేవీలకు ఈ సీనియర్ అసిస్టెంట్ వారధిగా మారారని నకిలీ సంతకాలు, తప్పుదారి పట్టించే విధానాలను, ప్రోత్సహిస్తున్నాడని మరియు ఎస్టాబ్లిష్మెంట్, బడ్జెట్, బదిలీలు ప్రమోషన్లు, నిబంధనల వక్రీకరణ, అన్ని ఈ ఒక్కరి ఆధీనంలో ఉండటం పరిపాలన అవకతవకాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సీనియర్ అసిస్టెంట్ డిటిడిఓ తో సత్సంబంధాలు కలిగి ఉంటూ వసూల్ రాజాగా.. పేరు గడించాడనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

‘మనీ కొట్టు..పోస్ట్ పట్టు’:
డిటిడిఓ కార్యాలయం లో ఏ పని కావాలన్నా సుంకం చెల్లించాల్సిందే. డిటిడిఓ పరిధి లో పనిచేస్తున్న కాంట్రాక్టు వార్డన్ ల రెన్యువల్ కోసం ఒక్కోక్కరి దగ్గర పది నుంచి ఇరవై వేల రూపాయల దాకా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారి ఫైలు ముందుకు కదలదని, అలాగే కింది స్థాయి ఉద్యోగులను కూడ వదలరనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కొందరి నుంచి అమ్యామ్యాలు అందుకుని 20 నుంచి 30 మంది వర్కర్లను అక్రమంగా కొలువుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. తక్షణమే పై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వివరణ…
నేను ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు అవుతుంది నేనంటే గిట్టని వారు నా మీద బురద జల్లుతున్నారు.
కిందిస్థాయి నుంచి డిటిడిఓ దాకా ఎదిగాను నేను ఎవరిపైనా వివక్ష చూపలేదు నాపై చేసేటువంటివన్నీ అబద్ధపు ప్రచారాలు మాత్రమే. నేనెవరిని ఇబ్బంది పెట్టట్లేనని సక్రమంగా విధులు నిర్వహించాలని ఉద్యోగస్తుల పట్ల కొంచెం కఠినంగా వ్యవవహరిస్తానని తెలిపారు.
- చత్రు నాయక్
