- రూల్స్ అన్నీ తుంగలో తొక్కుతున్నవైనం..
- అక్రమార్కులకు జైకొడుతున్న కమిషనర్!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో నిబంధనలు అపహాస్యమవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సింది పోయి, అవినీతి అధికారుల అడుగులకు మడుగులు వత్తుతోంది. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను మాతృసంస్థకు పంపాలని స్వయంగా మాతృసంస్థ కోరినా, గత కమిషనర్ ఆదేశాలు ఇచ్చినా.. ప్రస్తుత కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాత్రం ఆ అధికారిపై ఉన్న ‘ప్రేమ’తో నిబంధనలను తుంగలో తొక్కడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
ఆదేశాలు బేఖాతరు.. అక్రమార్కులకు
జైకొడుతున్న కమిషనర్!
గతంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ కె. ఇలాంబరిథి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ సనావుద్దీన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, ఆయనను వెంటనే మాతృసంస్థకు పంపాలని ఆదేశించారు. మాతృసంస్థ సైతం సిబ్బంది కొరత ఉందని లేఖ రాసినా, ప్రస్తుత కమిషనర్ అవన్నీ పక్కన పెట్టి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సిఫార్సు లేఖను సాకుగా చూపిస్తూ మరో ఏడాది పొడిగింపు ఇవ్వడం గమనార్హం. అంటే, జిహెచ్‌ఎంసిలో ఐఏఎస్ అధికారుల నిర్ణయాల కంటే రాజకీయ సిఫార్సులకే విలువెక్కువని కమిషనర్ స్వయంగా చాటిచెప్పినట్లయింది.
బదిలీల ఉత్తర్వులకే దిక్కులేదు.. అడ్మినిస్ట్రేషన్ ఎంత ‘వరస్ట్’?

జిహెచ్‌ఎంసి పరిధిలో జోనల్, సర్కిల్ కార్యాలయాల మార్పులు చేస్తూ కమిషనర్ ఇటీవల భారీగా బదిలీలు చేశారు. ఇందులో భాగంగా చంద్రాయణగుట్ట సర్కిల్ (ప్రస్తుతం రాజేంద్రనగర్ జోన్)నుండి సనావుద్దీన్‌ను చార్మినార్ సర్కిల్ (ప్రస్తుతం చార్మినా జోన్ 2) కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ, ఆశ్చర్యకరంగా ఆ అధికారి ఇప్పటికీ చంద్రాయణగుట్టలోనే తిష్టవేశారు. కమిషనర్ సంతకానికి విలువ లేదా?… సనావుద్దీన్ కు కమిషనర్ రూల్స్ వర్తించవా?…. రిలీవ్ కాకుండా అక్కడే కొనసాగుతున్నా… ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?ఈ పరిణామాలు చూస్తుంటే జిహెచ్‌ఎంసి అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కమిషనర్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నాడంటే సనావుద్దీన్ కు కమిషనర్ స్థాయిలోనే పూర్తిస్థాయి సహకారం అందుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఆదాబ్ హైదరాబాద్ కథనమే నిజమైంది!
గతంలోనే ఆదాబ్ హైదరాబాద్ ఈ అధికారి అవినీతిపై, నిబంధనల ధిక్కరణపై ఆధారాలతో సహా వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘‘చట్టంపై గౌరవం ఏది?’’ అంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. నేడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఆ వార్తను నిజం చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని పంపించాల్సింది పోయి, పట్టుబట్టి మరీ కొనసాగించడం వెనుక ఉన్న ‘కమిషన్ల’ భాగోతం ఏమిటో ప్రజలకు అర్థమవుతూనే ఉంది.
ప్రజాస్వామ్యమా.. పైరవీల రాజ్యమా?
ఒక ఉన్నత స్థాయి అధికారిగా చట్టాన్ని కాపాడాల్సిన కమిషనర్, కేవలం ఒక సిఫార్సు లేఖ కోసం చట్టబద్ధమైన ఉత్తర్వులను తుంగలో తొక్కడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుండటం వల్ల నిజాయితీ గల అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఈ వ్యవహారంపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేదంటే అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శల నుండి ఆయన తప్పించుకోలేరు.
