ఉపఎన్నిక ఫలితం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్(Naveen Yadav)ను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతిఒక్కరూ ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడి పేదల సంక్షేమం పట్ల తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించి మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) వంటి ఆలోచనలు, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారని అభిప్రాయపడ్డారు.

వచ్చే మూడేళ్లు ఈ దిశగా నిరంతరం పనిచేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు తమకు సరికొత్త ఉత్సాహం, ప్రోత్సాహం ఇచ్చాయని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయమని, వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే తమ మంత్రమని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందుండి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సీఎం రేవంత్ అభినందించారు.
