బొల్లారం, జనవరి 18(ఆదాబ్ హైదరాబాద్): కారణజన్ముడు, యుగపురుషుడు, పేదల పెన్నిధిగా పేరొందిన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి నేపథ్యంలో ఆ మహనీయుడి విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior Leader) గుండ్ల మహేందర్ రెడ్డి(Gundla Mahender Reddy) ఘనంగా నివాళులు (Tributes) అర్పించారు. బొల్లారం 272వ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గుండ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవల(NTR Services)ను స్మరించుకున్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడిగా నిలిచిన ‘అన్న’ ఎన్టీఆర్(Anna NTR) తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని మహేందర్ రెడ్డి కొనియాడారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడని పేర్కొన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితరసాధ్యమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్టీఆర్ చరిత్ర గతినే మార్చారని మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన వేసిన బాటే మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర చారి దమయ్య నాయుడు, సందీప్ రెడ్డి, ప్రభు, జగదీష్, దినేష్, భవాని, ప్రవీణ్ వర్మ, హరీష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

