- టీ కాంగ్రెస్ పార్టీలో కుర్చీల యుద్ధం..
- మున్సిపల్ కోడ్ ఎత్తగానే క్యాబినెట్ విస్తరణ?
- కార్పొరేషన్ చైర్మన్ పదవులపై నేతల కన్ను
- ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస నేతలు
- మార్చి మొదటి వారంలో పదవుల జాతర ఖాయం?
- మున్సిపల్లో అధిక సీట్లు సాధించే దిశగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తమకు అధిక స్థానాలు వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తోంది.. దానికి కారణాలు కూడా లేకపోలేదు..
మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే క్యాబినెట్ విస్తరణతో పాటు ఖాళీగా ఉన్న కీలక కార్పొరేషన్ పదవుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ గట్టి ” కసరత్తు చేస్తోందన్న సంకేతాలు
మున్సిపల్ ఎన్నికల ప్రసహనం ముగిసింది.. ఇక అన్ని పార్టీల వాళ్ళు.. ఓటర్లను మచ్చికచేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.. రాత్రుళ్ళ పూట రంజుగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని టాక్.. అయితే కాంగ్రెస్ పార్టీ తమకు అధిక స్థానాలు వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తోంది.. దానికి కారణాలు కూడా లేకపోలేదు.. ఆ పార్టీ అధికారంలో ఉంది.. అధికార యంత్రాంగం చేతుల్లో ఉంది.. ఫ్రీ బస్, విద్యుత్తు, సన్నబియ్యం లాంటి కొన్ని పథకాలు తమకు లభిస్తాయని భావిస్తున్నారు..
అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలన మొత్తం అవినీతిమయం అనే భావన ప్రజల్లో కలిగించడంలో కొంతమేర విజయం సాధించారని చెప్పవచ్చు.. అంతే కాకుండా ప్రజలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది.. అన్ని పథకాలు అందుకోవాలంటే కాంగ్రెస్ కే ఓట్లు వేస్తే.. కనీసం మిగిలిన రెండున్నర సంవత్సరాల్లో ఆ పథకాలు తమదాకా వస్తాయి కదాని ఆలోచిస్తున్నారు.. కనుక కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. పైగా మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించడం కూడా వారికి కలిసొచ్చింది..
నిన్నటితో ముగిసిన ప్రచార పర్వంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు మిగతా నాయకులు కూడా జోరుగా ప్రచారం చేసి గెలుపు ధీమాను వ్యక్తం చేశారు.. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొట్లాట మాత్రం రంజుగా సాగుతోంది.. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కీలక రాజకీయ కదలికలు మొదలుకానున్నాయి. క్యాబినెట్ విస్తరణతో పాటు ఖాళీగా ఉన్న కీలక కార్పొరేషన్ పదవుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ గట్టి కసరత్తు చేస్తోందన్న సంకేతాలు పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు, తర్వాత ఇచ్చిన హామీల అమలుపై నేతలు ఆశలు పెట్టుకోగా? పదవుల పంపకం కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. పదవి దక్కకపోతే ఊరుకునేది లేదంటూ కొందరు నేతలు బహిరంగంగానే అల్టిమేటం జారీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, “మాకు పదవి రాకపోయినా పరవాలేదు? కానీ వలస నేతలకు కీలక పోస్టులు ఇవ్వొద్దు” అంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారట.
ఈ నేపథ్యంలోనే కోడ్ ముగియగానే కాంగ్రెస్లో ‘పదవుల పందేరం’ మొదలవుతుందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఖాళీలతో పాటు అనేక కీలక కార్పొరేషన్ పదవుల భర్తీపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. కులసంఘాల కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
క్యాబినెట్ బెర్తుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా మంత్రి పదవులు దక్కించుకునేందుకు నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా అధిష్టానాన్ని కలిసి తన విన్నపాన్ని వినిపించినట్లు సమాచారం. ఇదే సమయంలో పరిగి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయి.
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రిని చేస్తానన్న సీఎం వ్యాఖ్యలు? సందర్భోచితమా? లేక ముందస్తు సంకేతమా? అన్న సందేహాలకు తావిస్తోంది. బీసీ కోటాలోనూ పోటీ ముదురుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కూడా రాజకీయ వేడెక్కిస్తోంది.
ఈ పదవిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఇవ్వాలన్న ప్రచారంతో కాంగ్రెస్ మహిళా నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. పార్టీ కోసం పోరాడిన తమను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టడం ఏంటన్న ఆగ్రహం మహిళా నేతల్లో వ్యక్తమవుతోంది. గత ఛైర్మన్ సునితా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆమె రాజీనామా చేయగా, మిగిలిన కాలానికి నేరెళ్ల శారద బాధ్యతలు చేపట్టారు. ఆమె పనితీరుపై మంచి పేరున్నా?
ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా నిలిపివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక విజయలక్ష్మికి పదవి కట్టబెట్టాలన్న వ్యూహమే ఉందన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి డిమాండ్లు, అభ్యంతరాలు, సామాజిక సమీకరణాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి. మార్చి తొలి వారంలో కాంగ్రెస్లో పదవుల పందేరం తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పంచాయతీలో ‘ఒరిజినల్ కాంగ్రెస్’ నేతలదే పైచేయా? లేక ‘కొత్త కాంగ్రెస్’ నేతలదే అదృష్టమా? అన్నది వేచి చూడాల్సిందే.
