బీసీ బిడ్డలు సర్పంచ్‌లుగా కాకుండా కుట్ర
ఆ 2 పార్టీల నమ్మకద్రోహ ఫలితమే జీవో-46
రేపు రాష్ట్రవ్యాప్తంగా జీవో-46 ప్రతుల దగ్ధం
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు
తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచి ఎన్నికల్లో (Sarpanch Elections) బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్-46ను విడుదల చేయడాన్ని బీసీ జేఏసీ చైర్మన్ (BC JAC Chairman) జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(Bjp)ల మోసం ఫలితమే ఈ జీవో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు (Reservations) అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్-9ని మొన్నటికి మొన్న విడుదల చేసిందని, ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసి 46 నంబర్ జీవో తీసుకొచ్చి బీసీల రాజకీయ అణచివేతకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రెడ్లను (Reddy) ఎక్కువ మందిని సర్పంచ్‌లు చేసి, సర్పంచ్ నుంచి సీఎం(CM)లుగా, కేంద్ర మంత్రులుగా ఉన్న ఆ వర్గం ప్రయోజనాల కోసమే జీవో నంబర్-46 ఉపయోగపడుతుందని, ఈ జీవో బీసీలకు రాజకీయ ఉరితాడు లాంటిదని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ(Assembly)లో మద్దతు పలికారని, రాష్ట్ర బంద్‌లో భాగస్వామ్యమయ్యారని, ఇదే స్ఫూర్తితో ఈ జాతీయ పార్టీలు పార్లమెంట్(Parliament)లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపచేయడానికి ప్రయత్నం చేసి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు పెద్దఎత్తున రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశం ఉండేదని, కానీ ఏమీ ప్రయత్నించకుండా రిజర్వేషన్ల విషయంలో 2 పార్టీలు కలిసి బీసీలను బలిపశువు చేశాయని దుయ్యబట్టారు.
జీవో నంబర్-46ను తక్షణం రద్దు చేయాలని, జీవో నంబర్ 9ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్-46 విడుదలను వ్యతిరేకిస్తూ రేపు (23వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా ఆ జీవో ప్రతులను దగ్ధం చేసి బీసీ సమాజం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలపాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
