కరీంనగర్, నవంబర్ 12 (ఆదాబ్ హైదరాబాద్): రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన (State Level Yogasana) క్రీడా పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ (Overal Championship) సాధించిన కరీంనగర్ జిల్లా క్రీడాకారులను కలెక్టర్ పమేల సత్పతి (Pamela Satpati) అభినందించారు. ఈ నెల 9న రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎంపీ అంతర్జాతీయ పాఠశాలలో తెలంగాణ యోగా అసోసియేషన్ (Telangana Yoga Association) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనబరిచి 83 పాయింట్లతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారు.
ఈ పోటీలో ఐదుగురు స్వర్ణ పథకాలు (Gold Medals), నలుగురు రజత పథకాలు, నలుగురు కాంస్య పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి యోగాలో జిల్లా కీర్తిని, దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషమని అన్నారు. మిగతా క్రీడలతో పోలిస్తే యోగా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములు కావాలని సూచించారు. జాతీయ స్థాయిలో సైతం జిల్లా క్రీడాకారులు పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.
రెండు దశాబ్దాలుగా జిల్లా యోగా అసోసియేషన్ క్రీడాకారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధమైన శిక్షణతో రాష్ట్రస్థాయిలో 16 సార్లు వరుసగా విజేతగా నిలుస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, గుంటి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి.శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, కోశాధికారి స్వరూప చారి, కోచ్‌లు వి.కిష్టయ్య, పిపిపి మల్లేశ్వరి, ఎ.ఆనంద్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
