కఠిన చర్యలు తప్పవు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద
మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియా(Social Media)లో ట్రోల్ (Troll) అవుతున్న బెదిరింపులు (Warning), అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ (Chairperson of the Women’s Commission) నేరెళ్ల శారద (Nerella Sharada) హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీతోపాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు (Written Complaint) చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు(Harassment), బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను అందించారు.
ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్‌పర్సన్‌కు ప్లే చేసి చూపించింది. పలు సోషల్ మీడియా హ్యాండిళ్లు నిరంతరం విద్వేష వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, దాడులు చేస్తూ మహిళా జర్నలిస్టులను అవమానించాలని, భయపెట్టాలని చూస్తున్నాయని తెలిపారు. తమపై “క్రమబద్ధమైన ఆన్‌లైన్ వేధింపుల ధోరణి” కొనసాగుతోందని తెలిపారు. కొన్ని హ్యాండిళ్లు ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, ప్రాణహానికర బెదిరింపులు, అవహేళనాత్మక పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నాయని చెప్పారు.
ఈ ట్రోలింగ్ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. విద్వేషపూరిత, మతపరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిళ్లు విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు. సంబంధిత హ్యాండిళ్లు, వ్యక్తులపై దర్యాప్తు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆన్‌లైన్–భౌతిక రక్షణను కల్పించాలని కోరారు. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు.
