ప్రజల్లో చైతన్యం పెంచాలి
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష
స్క్రబ్ టైఫస్(Scrub Typhus)పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (Special Task Force) ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు(Review Meeting). ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారినపడినవారికి అందుతున్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారినపడ్డారని అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాధి (Disease) కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటివరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్(Cause Of Death)పై పరిశీలన జరిపామని, స్క్రబ్ టైఫస్ వల్లే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ (Multi Organ Failure) కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు తెలిపారు.
ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని వెల్లడించారు. తమిళనాడు, ఒడిశాల్లో 7 వేల చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలుచేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
