- ఎండిన పంటల పరిశీలన.. అధికారులకు కీలక ఆదేశాలు
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు తీవ్ర కష్టాలు: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(MLA Chinta Prabhakar) ఆగ్రహం రైతుల పక్షాన పోరాడుతాం.. ఎవరూ అధైర్యపడొద్దు: బాధిత రైతులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భరోసా బీఆర్ఎస్ హయాంలో పంటలు ఎండిన దాఖలాల్లేవు.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక కన్నీళ్లు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కొండాపూర్:
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముందస్తు ప్రణాళిక కొరవడటంతోనే రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మండిపడ్డారు. కొండాపూర్ మండలంలో పర్యటించిన ఆయన, సాగునీరు, విద్యుత్ సరఫరా లేక నిలువునా ఎండిపోతున్న వరి పంటలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం – తక్షణ ఆదేశాలు:
చేతికందే దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయని చెప్పినా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని రైతులు వాపోవడంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(MLA Chinta Prabhakar) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడికక్కడే జిల్లా విద్యుత్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తక్షణమే పరిష్కరించి, పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని గట్టిగా ఆదేశించారు.
బీఆర్ఎస్ పాలనే రైతులకు రక్ష:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గంట కూడా కరెంట్ కోత లేకుండా చూశామని, ఏనాడూ పంటలు ఎండిపోయే పరిస్థితి రాలేదని రైతులు స్వయంగా గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాల్సింది పోయి, ప్రగల్భాలు పలుకుతూ కాలయాపన చేయడం సరికాదని దుయ్యబట్టారు.
అన్నదాతలకు పూర్తి భరోసా:
పంట నష్టపోతున్న రైతులెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము ఎల్లవేళలా రైతులకు అండగా నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పంట చేతికొచ్చే కీలక సమయంలో అన్నదాతలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు బాధ్యతగా మెలగాలని ఆయన హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
