అయ్య రికార్డులు.. కొడుకు భూముల ట్యాంపరింగ్లో సిద్ధహస్తులు
- చెంగిచర్లలో చెలరేగిపోయిన కబ్జాల ముఠా..
- కలెక్టర్ ఆదేశాలతో నమోదైన రికార్డుల ట్యాంపరింగ్ కేసు..
- మేడ్చల్ జిల్లాలో రంగ శ్రీనివాస్ గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేస్తున్న కబ్జాలకు బలి అవుతున్న పేదలు..
- రంగ శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలిచ్చినా ఆగని కబ్జాల పర్వం..
- రంగ శ్రీనివాస్ గౌడ్ అక్రమాలను కట్టడి చేయడంలో విఫలమైన రెవెన్యూ శాఖ
- ఖాతా నెంబర్ 28 వ్యవహారం అధికారులకు కనిపించడం లేదా..?
- మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్స్..
రెవిన్యూ రికార్డులు టాంపరింగ్ పై చర్యలు చేపట్టకుండా ప్రేక్షక పాత్రలో ఉన్న మేడిపల్లి తహసిల్దార్ కార్యాలయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండలం, చెంగిచెర్ల గ్రామ శివారులో రంగ రాజారాం, రంగ శ్రీనివాస్ గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన భూ రికార్డుల ట్యాంపరింగ్, కబ్జాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. గతంలో వి.ఏ.ఓ. గా పనిచేసిన రంగ రాజారాం రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా మార్పులు చేసి, పహానీల్లో పట్టాదారుల పేర్లు తొలగించి తన కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే బాటలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించి ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ వేల కోట్ల విలువైన భూములను కొల్లగొడుతున్నారని బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
వివరాలలోకి వెళితే చెంగిచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్లు 132, 133, 140, 141, 142లకు సంబంధించిన భూముల రికార్డుల్లో మార్పులు జరిగాయని నాటి కలెక్టర్ క్రిమినల్ కేసు నమోదు చేయుటకు చేసిన ఆదేశాలు అందుకు నిదర్శనంగా తెలుస్తుంది.. అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లను తొలగించి చేసుకున్న మార్పులను ఆధారంగా చేసుకొని, పేదల ప్లాట్లపై హక్కులు క్లెయిం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఒకవైపు పేదలను ఇబ్బందులకు గురిచేస్తూ మరోవైపు ప్రభుత్వ భూములను సైతం కొల్లగొడుతున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు..

కలెక్టర్ ఆదేశాలతో.. క్రిమినల్ కేసు నమోదు :
నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి లెటర్ 30. 21/4646/2003, ໖: 23-03-2004 ఘట్కేసర్ తహసీల్దార్కు రంగ రాజారాం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాటి తహసిల్దారు పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఫిర్యాదు వీరి అవినీతి అక్రమాలకు అద్దం పడుతుంది.. ఇందుకు ఆధారమే లెటర్ నెంబర్. 21/3891/95, 38 27-03-2004 ద్వారా నాచారం పోలీస్ స్టేషన్ లో చేసిన పిర్యాదు..
తాసిల్దార్ ఫిర్యాదు మేరకు రంగ రాజారాం పై క్రైమ్ నెంబర్. 65/2004గా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ కేసు నమోదు కావడం, దీనిపై నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వీరి కబ్జాలు మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉందని, అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు.. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ కేసు నమోదైనా ఆ కేసు పురోగతి ఏ దశలో ఉందో ఇప్పటివరకు స్పష్టత లేదని బాధితులు వాపోతున్నారు..
తండ్రి బాటలో కొడుకు?
రంగ రాజారాం తరువాత, ఆయన కుమారుడు రంగ శ్రీనివాస్ గౌడ్ కూడా నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా పేదల ప్లాట్లను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. వీరి బారిన పడ్డ బాధితులు కోర్టును ఆశ్రయించగా, ఇటీవలే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో రంగ శ్రీనివాస్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేటికీ వీరి కబ్జాల పర్వం కొనసాగుతుందని తేటతెల్లమవుతుంది.. ఇతగాడు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కేసు నమోదు చేయకుండా అధికారులను మేనేజ్ చేసుకుంటున్నాడని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి..

వీరి కబ్జాలకు ఆధారమే ఖాతా నెం. 28 :
రంగ రాజారాం కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేస్తున్న ఖాతా నెంబర్ 28ను టిఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా ఇదే ఖాతా నెంబర్ 28 క్లెయిం చేస్తున్నారని రెవెన్యూ రికార్డులు చూస్తే స్పష్టం అవుతుంది.. ఈ ఖాతా నెంబర్ ఆధారంగా ఆర్ఆర్ చట్ట ప్రకారం ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఒక ఖాతా నెంబర్ మాత్రమే ఉంటుందనేది జగమెరిగిన సత్యం..
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమంగా సృష్టించిన నకిలీ పట్టా పాస్ పుస్తకంపై గతంలోనే ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదయింది అనేది అందరికీ తెలిసిన విషయం విధితమే.. ఇలా వీరు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లతో, నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో భూ కబ్జాలకు పాల్పడుతూ వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములతో సహా పేద ప్రజల ప్లాట్లను సైతం కబ్జాలు చేస్తున్న విషయంపై సమగ్ర విచారణ జరిపి, ఖాతా నెంబర్ 28 అసలు హక్కుదారులు ఎవరో అన్నది స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో అధికారుల పాత్ర.. ! :
రికార్డుల ట్యాంపరింగ్ కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది..? నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై చర్యలు తీసుకున్నారా..? ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తహసీల్దార్ కార్యాలయం ఎలాంటి చర్యలు చేపట్టింది? భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఈ వ్యవహారంపై స్పందించిందా? రంగ శ్రీనివాస్ గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు ఇచ్చిన ముడుపులకు కొంతమంది అధికారులు అమ్ముడుపోయి నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేక ఉన్నత స్థాయి అధికారుల మద్దతు సైతం ఉందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి…
మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలి..! :
మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిజ నిర్ధారణ కమిటీని నియమించి, ఓకే ఖాతా నెంబర్ 28ను ఇరువురు క్లైమ్ చేయడంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.. వీరు అక్రమంగా సృష్టించిన రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి.. నకిలీ పత్రాలపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రభుత్వ భూముల పరిరక్షణ చేపట్టాలని స్థానికులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలతో మరో ప్రత్యేక కథనాన్ని వెలుగులోకి తీసుకుని రానుంది
