Saturday, October 4, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్చాళుక్య శిల్పాలకు ఆదరణ కరువు

చాళుక్య శిల్పాలకు ఆదరణ కరువు

ఆలనాపాలనాలేని అద్భుత శిల్పాలు
కాపాడుకోవాలంటున్న శివనాగిరెడ్డి

కర్నూలుకు కూతవేటు దూరంలో ఉన్న పంచలింగాల గ్రామంలో బాదామీ చాళుక్యుల శిల్పాలకు ఆదరణ కరువైందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వారసత్వ సంపదను గుర్తించి, చారిత్రక ప్రాధాన్యత పై స్థానికులకు అవగాహన కల్పించే ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటి’ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు స్థానిక పంచలింగేశ్వర ఆలయ సముదాయాన్ని సందర్శించారు. గ్రామంలో బాదామీ చాళుక్యుల (సా.శ. 7వ శతాబ్ది) కాలపు రెండంతస్తుల మండపం, మహిషాసురమర్ధిని, పంచ లింగేశ్వర ఆలయాలు అలనాటి ఆలయ వాస్తుకు అద్దం పడుతున్నాయన్నారు.

తుంగభద్రా నది ఎడమ గట్టునున్న ఈ ఆలయ సముదాయం, భూమట్టం కంటే నాలుగు అడుగుల లోతున ఉందనీ, ఆలయం ముందు ఐదు లింగాలు చెక్కిన శాసనం, అమ్మతల్లి, గణేశ విగ్రహాలు ఎండకి ఎండుతూ, వానకు తడుస్తున్నాయని, ఒకే పానపట్టంపై ఐదు లింగాలు ఉన్న పంచలింగేశ్వర ఆలయంలో లింగం వెనక ఒక మూలన గణేశ, సప్తమాత్రుకులు, సూర్య, మహిషాసురమర్దిని విగ్రహాలు ఒక గుట్టగా ఉన్నాయని, 1300 సంవత్సరాల నాటి ఈ అపురూప శిల్పాలను ఆలయం బయటకు తెచ్చి, పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాల ఉన్న పేరు పలకలను ఏర్పాటు చేసి, భద్రపరిచి, భవిష్యత్ తరాలకు అందించాలని ఆలయ అధికారులు, గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకే పానంపటంపై ఐదు శివలింగాలున్న రాష్ట్రంలోనే అరుదైన పంచలింగాల దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని జిల్లా యంత్రాంగాని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News