Wednesday, March 4, 2026
Homeసాహిత్యంBapu | చెరగని గీతలు.. బాపు బొమ్మలు..

Bapu | చెరగని గీతలు.. బాపు బొమ్మలు..

ముగ్ధ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి. సిగ్గు పడతాయి. నవ్విస్తాయి. వెక్కిరిస్తాయి. సకల చేష్టలూ ప్రదర్శిస్తాయి. బాపు రేఖా చిత్రాలు ఎలా గీసినా అవన్నీ కార్టూన్లు (Cartoons) అయి సమ్మోహనపరుస్తాయి. అందమైన అమ్మాయి(Beautiful Girl)కి మారు పేరు ‘బాపు బొమ్మ’. బాపు.. రమణ(Ramana)తో కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్ళ సీత, అప్పుల అప్పారావు(Appula Appa Rao), గిరీశం, లావు పాటి పెళ్ళాం-బొచ్చు కుక్క లాంటి బుజ్జి మొగుడూ.. వీరంతా గుర్తుకొస్తే నవ్వు కాకుండా ఉండటం అసాధ్యం.

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ(Satthiraju Venkata Lakshminarayana). 1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక అనే దిన పత్రికలో వ్యంగ్య చిత్రకారుడిగా చేరారు. బాపు చిత్ర కళ ఒక విషయానికి పరిమితం కాలేదు. 1945 నుంచి బాపు.. చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, పుస్తకాల, పత్రికల ముఖ చిత్రాలు, కథలకు బొమ్మలు, విషయానుగుణ చిత్రాలు పుంఖాను పుంఖాలుగా వేశారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తి, సినిమాలూ.. అన్ని రంగాల్లో ఆయన గీతలు వాసికెక్కాయి.

- Advertisement -

దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి(Sakshi). తర్వాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండి తెరపై సృష్టించారు. అందులో ‘ముత్యాల ముగ్గు’ (Muthyala Muggu) సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. బాపు దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు.. అవార్డులు, రివార్డులు పొందటంతోపాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచాయి. బాపు-రమణలవి అవిభాజ్య శరీరాలు. ఒకరిది లేఖా చిత్రమైతే, మరొకరిది రేఖా చిత్రం. రెండూ కలిస్తే మనోహర చిత్రం. అదే చలనచిత్రం. అందుకే బాపు, రమణలను వేరు చేసి చూడలేం.

1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో 5, 6 తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, రమణ మధ్య స్నేహం పరిమళించింది. చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే ‘బాల’ అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు ‘అమ్మ మాట వినకపోతే’ అనే కథను రమణ రాస్తే దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ ‘కోతికొమ్మచ్చి’, ‘బుడుగు’లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు.

1967లో సాక్షి (సినిమా) చిత్రానికి దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాపు.. మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొని, మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. సీతాకల్యాణం సినిమాను లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975లో) కేంద్ర ప్రభుత్వ బహుమతి, 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక బహుమతిని మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్లపూడి వెంకట రమణతో కలిసి స్వీకరించారు.

చెన్నై(తమిళనాడు)లోని శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ నుంచి రాజ్యలక్ష్మి బహుమతి 1982లో, 1991లో ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ, 1992లో అమెరికా తెలుగు అసోసియేషన్(ATA) నుంచి శిరోమణి బహుమతి అమెరికాలో స్వీకరించారు. 1993లో మిస్టర్ పెళ్లాం సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ బహుమతి, 1995లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) నుంచి తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకి తన 80 ఏళ్ల (గోల్డెన్ జూబ్లీ సెలేబ్రేషన్) సేవకు ఘన సన్మానం, బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996లో ఏపీ ప్రభుత్వ నంది అవార్డు వరించాయి.

2001 జూన్ 9న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (IIC) నుంచి జీవిత సాఫల్య బహుమతి, 2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట బహుమతి, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు, బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్లాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, 2013లో ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కళల విభాగంలో తమిళనాడు కేటగిరీలో పద్మశ్రీ బహుమతి లభించాయి. బాపు 2014 ఆగస్టు 31న చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాపు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు.

కొంటెబొమ్మల బాపు.. కొన్ని తరముల సేపు.. గుండె ఊయలలూపు.. ఓ కూనలమ్మా!.. ఇలా ఆరుద్ర.. బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకం ఆయన అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.

(డిసెంబర్ 15న బాపు జయంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News