- బీసీలకు ద్రోహం చేస్తున్నపార్టీలను ఓడించాలి.
- జనరల్ స్థానాలలో బీసీలను గెలిపించాలి.
- బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు.
మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు ద్రోహం చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ లో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, బీసీ జిల్లా నాయకులు చంద్రశేఖర్, చెరుకల రాజు, నారాయణతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ…
బీసీల పోరాటాల ఫలితంగా స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విడుదల చేసిన జీవోనెంబర్ 9 పై హైకోర్టుకు వెళ్లి రద్దు చేయించిన బీసీ ద్రోహి రెడ్డి జాగృతి సంస్థకు చెందిన బుట్టెంగారి మాధవ రెడ్డికి మేడ్చల్ జిల్లా చింతలపల్లి మున్సిపాలిటీలో 10వ వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం బిఆర్ఎస్ నిజస్వరూపం బయట పడిందన్నారు.
గతంలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% తగ్గించిన బిఆర్ఎస్ 42 శాతం రిజర్వేషన్లకు అమలు జరగకుండా కోర్టుకు వెళ్లిన మాధవ రెడ్డికి ‘బి ఫామ్’ ఇవ్వడంతో బిఆర్ఎస్ చిత్తశుద్ధి ఏమిటో బట్టలైందన్నారు. దేశంలో ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిన బిజెపి తెలంగాణ శాసనసభ బీసీ బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపించిన వాటిని ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు చేసిన ద్రోహాన్ని ఎవరు మర్చిపోరన్నారు. శాసనసభలో బిల్లులు మాత్రమే ఆమోదించి కేంద్రానికి పంపించి, కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రజలకు అర్థమైందన్నారు.
రాష్ట్రంలో కార్పొరేషన్ల పదవులు అగ్రవర్ణాలకు కట్టబెట్టి 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మొండి చేయి చూపిన తీరు బీసీలు గమనించారన్నారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు జరపకుండ, బడ్జెట్లో నిధులు కేటాయించకుండ, కేటాయించిన వాటిని కూడా విడుదల చేయకుండ చేస్తున్నఅన్యాయాలను బీసీలు గమనిస్తున్నారన్నారు.
ఈ పరిస్థితుల్లో జరుగుతున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో డబ్బు మద్యం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బీసీ వ్యతిరేక పార్టీల అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్పాలని, జనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులను, ప్రజా సంక్షేమం- అభివృద్ధి కోసం పాటుపడే ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులను, వ్యక్తులను గెలిపించాలని వెంకట్రాములు చైతన్యవంతులైన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
