- నేత చుట్టూ చేరిన చోటా గ్యాంగ్?
- నెలనెలా చెల్లింపుల ఆరోపణలు..
- సారొస్తే వీళ్లదే ఓవరాక్షన్! అంటూ కార్యకర్తల్లో చర్చ
- సీనియర్ నాయకులకు దూరమవుతున్న నేత..
- అనుచరుల వ్యవహారశైలిపై సీనియర్లలో అసంతృప్తి
- కక్కలేక మింగలేక మిన్నకుంటున్న నేత..?
పాపన్నపేట: నియోజకవర్గ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓ నాయకుడి(BRS Leader) చుట్టూ తిరుగుతున్న కొందరు అనుచరుల వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాయకుడి కార్యక్రమాల్లో ముందుండటం, ప్రతి పర్యటనలో హడావుడి చేయడం వంటి చర్యలతో ఈ వర్గం ప్రత్యేకంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాయకుడు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో సదరు వర్గం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, దీంతో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, స్థానికంగా పట్టు ఉన్న నేతలు అసౌకర్యానికి గురవుతున్నారనే చర్చ సాగుతోంది. “సారొస్తే వారిదే ఓవరాక్షన్” అన్న వ్యాఖ్యలు కూడా కార్యకర్తల మధ్య వినిపిస్తున్నాయి. నాయకుడి వెంటే ఉండే కొందరికి నెలనెలా ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సుడిగాలి పర్యటనలు.. ఆర్థిక సహాయాలు
సదరు నేత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఆపదలో ఉన్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఈ వర్గం ముందుండటం, అత్యుత్సాహం ప్రదర్శించడం చర్చకు దారితీస్తోంది. ప్రజల్లో సదరు నేతకు మద్దతు పెంచాల్సిన చోట ఈ బ్యాచ్ అత్యుత్సాహం పార్టీకి ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కడివెడు పాలల్లో కశికెడు పేడలా..?
సదరు బిఆర్ఎస్ నేతకు(BRS Leader) ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. సౌమ్యుడు, అందరితో కలుపుగోలుతనం, దాతృత్వం, మంచితనం, విమర్శలకు తావివ్వని నేత. కానీ కొందరి ఓవరాక్షన్ వల్ల అతని నాయకత్వ ప్రతిష్టకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. కడివెడు పాలల్లో కశికెడు పేడలా ఉన్న కొందరి వ్యవహారశైలి మొత్తం నాయకత్వానికి ఇబ్బందిగా మారకూడదని సీనియర్లు సూచిస్తున్నట్లు సమాచారం.
సీనియర్లకు మింగుడుపడని వ్యవహారం:
నియోజకవర్గంలో చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి కొత్తగా ఏర్పడిన వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంతృప్తి కొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది. నాయకుడి పర్యటనల్లోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఇదే వర్గం ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల పాత నాయకత్వం అసంతృప్తికి గురవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
దూరం పెడితేనే మైలేజ్ పెరుగుతుందా?
నాయకుడికి నిజమైన రాజకీయ బలం కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజలతో ఉన్న సంబంధాల నుంచే వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాయకుడి చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల పార్టీకి నష్టం కలుగుతున్నట్లు భావిస్తే, వారిని నియంత్రించడం లేదా పార్టీ వ్యవహారాల్లో వారి పాత్రను పరిమితం చేయడం ద్వారా మరింత మద్దతు లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతకు కక్కలేక మింగలేక మిన్నకుంటున్న పరిస్థితి ఏర్పడిందని దగ్గరి సహచరులు అనుకుంటున్నారు. నాయకుడి చుట్టూ ఉండే వర్గం వారికి బలం కావాలే తప్ప.. బలహీనతగా మారకూడదనే సూచనలు ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
