పుస్తక చికిత్స అనేది మనసుకు మందు(Medicine). ఎంపిక చేసిన సాహిత్యాన్ని (Literature) చదవడం ద్వారా మానసిక, భావనాత్మక సమస్యలను అర్థంచేసుకోవడానికి, ఎదుర్కోవడానికి ఇదొక సాధనం. గ్రీకు పదాలు ‘బిబ్లియో'(పుస్తకం), ‘థెరపియా'(నలుగడం) నుంచి ఉద్భవించిన ఈ పదాన్ని 1916లో ప్రచారంలోకి తీసుకొచ్చారు. ప్రాచీన కాలంలో గ్రంథాలయాలను (Libraries) ‘ఆత్మ నలిగే స్థలాలు’గా పిలిచేవారు. ఈ ఆలోచన చాలా పురాతనమైంది.
పుస్తక చికిత్స ప్రాథమికంగా 3 రకాలు. ఒకటి.. సూచనాత్మక చికిత్స. ఇందులో చికిత్సకుడు ఒత్తిడి (Stress) లేదా దుఃఖం వంటి నిర్దిష్ట సమస్యకు పుస్తకాలను (Books) సూచిస్తారు. రెండు.. సంకర చికిత్స. ఇందులో చదవడం(Reading)తోపాటు దానిపై చర్చలు, కార్యాచరణలు ఉంటాయి. మూడు.. స్వయం చికిత్స. ఇందులో వ్యక్తి స్వతహాగా తనకు అనుకూలమైన పుస్తకాలను ఎంచుకొని చదువుతాడు. ఇది వైద్యుల మార్గదర్శనం(Guidance)లో క్లినికల్ సెట్టింగ్‌లో, పాఠశాలల్లో పిల్లల భావనాత్మక వికాసానికి మద్దతుగా నిలుస్తుంది.
ఈ చికిత్స (Treatment) ప్రయోజనాలు అనేకం. వ్యక్తులకు కొత్త దృక్కోణాలను అందిస్తుంది. ఇతరులూ తనలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు అనే భావన లేకుండా ఆందోళన, ఒత్తిడి, దుఃఖం వంటి భావాలను నివారించుకోవడంలో సహాయపడుతుంది. సమస్యకు తగిన పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్యంపై సకారాత్మక (పాజిటివ్) ప్రభావాన్ని చూపుతుంది.
ఈ ప్రక్రియ సాధారణంగా 4 దశల్లో సాగుతుంది. మొదట.. చదివే వ్యక్తి కథలోని పాత్ర లేదా పరిస్థితితో తననుతాను ఊహించుకుంటాడు. తర్వాత.. కథా ప్రవాహంలో అతని మనసులోని భావాలు విడుదలవుతాయి. ఇది ఒక రకమైన భావోద్వేగ శుద్ధి. ఆ తర్వాత.. ఆ పాత్రలు తమ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాయో చూసి తన జీవితంలోని సవాళ్లకూ కొత్త పరిష్కార మార్గాలు అర్థమవుతాయి. చివరగా.. ఈ కొత్త అవగాహనను అతను తన నిజ జీవితంలో అమలుచేయడానికి ప్రయత్నిస్తాడు.
ఈ చికిత్సలో కథలు, నవలలు, కవితలు, స్వయం సహాయ గ్రంథాలు, జీవిత చరిత్రలు.. ఏ రకమైన సాహిత్యమైనా ఉపయోగించబడుతుంది. గ్రంథాలయాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అవి వివిధ అవసరాలకు అనుగుణంగా పుస్తకాల సేకరణ చేస్తాయి. రీడింగ్ క్లబ్‌లను నిర్వహిస్తాయి. సురక్షితమైన, చదివే ప్రశాంత వేదికలను సృష్టిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతి గుర్తింపు పొందుతోంది. యునైటెడ్ కింగ్డమ్‌లో ‘రీడింగ్ వెల్’ కార్యక్రమాలు డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలు ఉన్నవారికి వైద్యులు సూచించగల గ్రంథాల జాబితాలను తయారుచేశాయి. పరిశోధనలు నిరంతరం ఈ పద్ధతిలోని ప్రయోజనాలను నిరూపిస్తున్నాయి. సరైన పుస్తకాలు ఆందోళన, డిప్రెషన్ వంటి రుగ్మతలను గణనీయంగా తగ్గించగలవని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.
అయినా.. కొన్ని ముఖ్యాంశాలు గమనించాలి. పుస్తక చికిత్స తీవ్ర మానసిక రుగ్మతలకు సంపూర్ణ ప్రత్యామ్నాయం కాదు. ఇతర చికిత్సలకు సహాయకంగా మాత్రమే ఉపయోగపడుతుంది. పుస్తకాల ఎంపిక చాలా కీలకం. తప్పుడు సందేశాలున్న పుస్తకాలు సమస్యను మరింత పెంచుతాయి. ప్రతి ఒక్కరికీ అన్ని పుస్తకాలు ఒకేలా పనిచేయవు. ఒక పుస్తకం మీ హృదయంతో మాట్లాడకపోతే దాన్ని వదిలేసి మరొకదాన్ని ప్రయత్నించడం ఎలా అనేది ఈ చికిత్సలో అంతర్లీనంగా దాగి ఉన్న సుందరాంశం. మీ సొంత మానసిక సమస్యలకు అనుగుణంగా మార్పులను సూచించే ఒక వ్యక్తిగత చికిత్సే ఈ సంజీవని పుస్తకాలయం (బిబ్లియోథెరపీ).
డాక్టర్ బి.రాధికా రాణి
అసిస్టెంట్ ప్రొఫెసర్
హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
