- దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ రిజల్ట్..
- 11న రెండో దశ పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు
- తొలిదశలో రికార్డు స్థాయిలో 65.08 శాతం ఓటింగ్
బీహార్లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చివరి దశకు చేరుకుంది. నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే జరిగిన తొలి దశ పోలింగ్లో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 65.08 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండో దశలో 122 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రచారపు చివరి రోజైన ఆదివారం బీహార్ రాజకీయ రంగం ఉత్కంఠతో మరిగిపోయింది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జంగిల్రాజ్ పాలనకు ప్రజలు గట్టి చెక్ పెట్టారని, తొలి విడతలోనే ఇండియా కూటమికి 65 వోల్ట్ షాక్ ఇచ్చారని ప్రధాని వ్యాఖ్యానించారు. బీహార్లో ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తాను ప్రమాణ స్వీకారానికి వస్తానని ఆయన ధీమాగా తెలిపారు. అమిత్ షా కూడా విపక్షాలపై ఘాటుగా దాడి చేశారు. బీహార్ ప్రజలు మళ్లీ అశాంతి పాలనకు లోనవ్వరని, దేశంలో చొరబాటుదారులను ఏరివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్డీఏ ప్రచార వ్యాఖ్యలని ఖండిస్తూ, వారి వాదనల్లో అబద్దాలు తప్ప తప్ప వాస్తవాలు లేవని తిప్పికొట్టారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు ఎన్నికల కమిషన్ సహకరిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మరోవైపు, బీహార్ ప్రచారం ముగిసిన మరుసటి రోజే రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన చేయడం బీజేపీ నాయకుల విమర్శలకు దారితీసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాహుల్ గాంధీని పిక్నిక్లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ ఎన్నికల కీలక సమయంలో బీహార్ ప్రచారానికి దూరంగా ఉండటం అంటే విపక్షాలు ఓటమిని ముందుగానే అంగీకరించినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు బీహార్ ఎన్నికలు దేశ రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా భావిస్తున్న వేళ, ప్రచారం ముగియడంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెలకొంది.
