ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
- భూ యజమానుల నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు
- సర్కారుకు మాత్రం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ పూర్తిగా చెల్లించని వైనం
- మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్లు పరిశీలనలో వెల్లడి
- ఈ కుంభకోణానికి సీసీఎల్‌ఏ టెక్నికల్ టీమ్ సహకరిస్తున్నట్లు అనుమానాలు
- జనగామ ఎమ్మార్వో ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు
- తప్పు చేసినవారికి తగిన శిక్షలు పడాలని కోరుతున్న జనం..
గత బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని ధరణి వెబ్‌సైట్‌లో అక్రమాలు జరిగాయని, వాటికి చెక్ పెట్టేందుకు ధరణి స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన భూభారతి చట్టం కూడా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చే అక్రమాలు ఇటీవల బయటపడ్డాయి. భూభారతి చట్టాన్ని వాడుకొని కొందరు అవినీతిపరులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో భూయజమానుల నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్‌ను పూర్తిగా వసూలు చేసినప్పటికీ ఆ ఫీజులు మొత్తాన్ని గవర్నమెంట్‌కు చెల్లించలేదు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్‌లో స్వల్ప మొత్తాలను మాత్రమే సర్కారు చెల్లించి మిగిలిన సొమ్మును వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది.

ఈ కుంభకోణానికి సీసీఎల్‌ఏలోని టెక్నికల్ టీమ్ సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ, విూ సేవ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కుంభకోణం జనగామ జిల్లాలో వెలుగుచూడటంతో ఆ జిల్లాలోని స్టాంపులు రిజిస్ట్రేషన్ల అధికారులకు సైతం లోకాయుక్త ఆదేశాలు ఇచ్చింది. భూభారతి చట్టాన్ని వాడుకొని ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
జనగామ జిల్లా కేంద్రంలో ఒకే రోజు రూ.8 లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్కదారి పట్టించిన ఘటన బయటకు రావడంతో లోకాయుక్త తనకుతానుగా కేసు నమోదు చేసింది. ఈ రిజిస్ట్రేషన్ల దందాను జనగామ తహశీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్ గుర్తించి జనగామ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 7వ తేదీ బుధవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్(నంబర్ 10/2026) నమోదైంది. ఇందులో 318(4), 316(2), 316(5), 337, 338, 336(3), 340(2), 61(2) బీఎన్‌ఎస్, 66డీ ఐటీఏ యాక్ట్`2008లను చేర్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రకారం నిర్వహిస్తున్న భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలపై కార్యాలయ స్థాయిలో పరిశీలన చేయగా ఈ అవకతవకలను గుర్తించినట్లు తహశీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘2025 డిసెంబర్ 24న జరిగిన రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా, అత్యల్ప మొత్తాలు మాత్రమే చలాన్ రూపంలో చెల్లించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. భూయజమానుల నుంచి మాత్రం పూర్తి స్థాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు మాత్రం అత్యల్ప మొత్తాన్ని మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది.
వెరిఫికేషన్‌లో మరో అత్యంత కీలకమైన అంశం తేలింది ఏమంటే..

ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చలాన్ చెల్లింపు రసీదులను మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మార్చి (మోడిఫై చేసి), పూర్తి చలాన్ మొత్తం చెల్లించినట్లు చూపించిన నకిలీ రసీదులు తయారుచేసిట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అసలు ప్రభుత్వ రికార్డుల్లో చెల్లించిన మొత్తం అత్యల్పంగా ఉండగా చలాన్ రసీదుల్లో మాత్రం మార్కెట్ విలువకు అనుగుణంగా మొత్తం చెల్లించినట్లు చూపించడం ద్వారా ప్రభుత్వ అధికారులను తప్పుదారి పట్టించడం, ప్రభుత్వ ఆదాయాన్ని కాజేయటం జరిగిన్లు స్పష్టంగా తేలింది.
ఈ విధంగా నకిలీ లేదా మార్పు చేసిన ఎలక్ట్రానిక్ చలాన్ రసీదుల ఆధారంగా పరిశీలన జరిపినప్పుడు నిధుల దుర్వినియోగం ఎంత అనేది ఖచ్చితంగా నిర్థారణ అయింది. ఈ చర్యల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇది సంఘటితంగా, ముందస్తు ప్రణాళికతో నిర్వహించిన ఆర్థిక మోసంగా స్ఫష్టమవుతోంది. అందువల్ల ఈ వాస్తవాలను, డాక్యుమెంట్ నంబర్లను, చలాన్ వివరాలను, డిజిటల్ ఆధారాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఈ మోసాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో విచారించి భూభారతి రిజిస్ట్రేషన్ లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి జరిగిన నష్టానికి బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని జనగాం మండల తహశీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదేం చోద్యం?
ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా భారీగా వేతనాలు తీసుకుంటూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతూ కొంత మంది అధికారులు ఇలా అక్రమాలకు పాల్పడుతుండటం, ప్రభుత్వ ఆదాయానికే గండి కొడుతుండటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును జేబులోకి నొక్కేస్తూ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కుతుంటే ఇక ప్రజలకు ప్రభుత్వంపై ఏం నమ్మకం ఉంటుంది?. సీసీఎల్‌ఏలోని సాంకేతిక సిబ్బంది ఈ కుంభకోణానికి సహకరించిన్లు వార్తలు రావటం మరింత చోద్యంగా మారింది.
పాత చట్టాలను మార్చి కొత్త చట్టాలను తెచ్చినా, పాత వెబ్‌సైట్లను తీసేసి కొత్త వెబ్‌సైట్లను రూపొందించినా అక్రమాలు మాత్రం ఆగకపోవటం విడ్డూరంగా ఉందని జనం అంటున్నారు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే తప్పు చేసినవారికి తగిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క జనగాంలోనే ఒక్క రోజులోనే ప్రభుత్వానికి రూ.8 లక్షల నష్టం జరిగిందంటే రాష్ట్రవ్యాప్తంగా భూభారతిలో ఇంకెన్ని అక్రమాలు జరుగుతున్నాయో అని సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని కోరుతున్నారు.
