- సీఎంఆర్ కళాశాల పై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే
- రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ సవాల్
సీఎంఆర్ కళాశాల పై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ సవాల్ విసిరారు. సుతారిగూడ చెరువు కాలుష్యానికి సీఎంఆర్ కళాశాల డ్రైనేజ్ నీరే కారణమని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం అసత్యమని ఆయన మండిపడ్డారు. మంగళవారం సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఎన్టీపీ (సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను మీడియా ప్రతినిధులకు చూపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సీఎంఆర్ క్యాంపస్లో ఎన్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీటిని కళాశాల ప్రాంగణంలోని చెట్లకు వినియోగిస్తున్నామని తెలిపారు.సుతారిగూడ చెరువులోకి వెళ్తున్న మురుగు నీరు కండ్లకోయ గ్రామపంచాయతీకి చెందినదేనని, గతంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి డ్రైనేజ్ పైప్లాన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని, అలాంటి వారు ప్రజలకు హాని చేసే పనులు చేయరని అన్నారు.
మేడ్చల్ ప్రాంతంలో నీటి సమస్యల పై కూడా సీఎంఆర్ నీటిని ఉపయోగిస్తున్నారనే ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. మల్లారెడ్డి కళాశాలకు ఎలాంటి నీటి కనెక్షన్ లేదని తెలిపారు. ఇక పై మల్లారెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి, విట్టల్, జంగారెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
