పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ (Bharat Forge) వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి (Amit Kalyani) ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణికి వివరించారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణం(Ship Building)తోపాటు పర్యాటక ప్రాజెక్టులకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. వీటిపై స్పందించిన అమిత్ కళ్యాణి.. ఏపీలో షిప్ బిల్డింగ్‌తోపాటు అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ (Advanced Electronics) ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చంద్రబాబుకు చెప్పారు. తిరుపతి (Tirupati) సమీపంలో అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గండికోట (Gandikota) వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచన ఉందన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. వాణిజ్య నౌకలతోపాటు డిఫెన్స్ నౌకల నిర్మాణానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ రంగంలో ఇండియాలో తయారీ అతితక్కువగా ఉందని, దేశంలోని కంపెనీలు వినియోగించుకోవాలని అన్నారు. భారత్ ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు అనుకూలమని తెలిపారు. అలాగే.. వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకూ విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అరకు కాఫీ లాంటి ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హైదరాబాద్-అమరావతి -చెన్నై-బెంగుళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వస్తున్నట్లు సీఎం వివరించారు.
