Thursday, February 12, 2026
Homeఆరోగ్యంMeditation | సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని.. ధ్యానం

Meditation | సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని.. ధ్యానం

ప్రపంచ శాంతి(world peace), అంతర్గత ప్రశాంతత, స్వీయ అవగాహన, మానసిక స్థిరత్వం(Mental stability), శారీరక దృఢత్వం, భావోద్వేగ నియంత్రణ(Emotional regulation) కోసం ధ్యానం దోహదపడుతుందని గుర్తించిన ఐరాస సర్వ సభ్య సమావేశం ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం.. 2024 నుంచి ఏటా డిసెంబర్‌ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం(World Meditation Day) పాటిస్తున్నారు. 2025 థీమ్: అంతర్గత శాంతి, ప్రపంచ సామరస్యం(Inner peace, world harmony).

భారతీయ ధ్యానం.. ప్రపంచవ్యాప్తం..

- Advertisement -

ధ్యానం.. పురాతన అభ్యాసం. వేల ఏళ్లుగా ఆచరిస్తున్న సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని. క్రీస్తు పూర్వం 5 వేల నాటికే మన దేశంలో ధ్యాన అభ్యాసం ప్రారంభమైంది. హిందూ, బౌద్ధ సంప్రదాయంలో అంతర్భాగమైంది. ఇస్లామిక్‌ సూఫీ ఆధ్యాత్మికవేత్తలు, క్రైస్తవ సన్యాసులు, జైన మతస్థులు, టావోయిజం పాటించేవారు, సిక్కులు, జొరాస్ట్రియన్లు కూడా ధ్యాన ప్రార్థనలు చేసేవారని చరిత్ర చెబుతోంది. అష్టాంగ యోగాల్లో కీలకమైన ప్రక్రియ ధ్యానం అని పతంజలి యోగా సూత్రాల్లో వర్ణించారు. భగవద్గీత, ఉపనిషత్తుల గ్రంథాల్లో కూడా ధ్యానం అతి ప్రధానమైందని తెలిపారు. గౌతమ బుద్ధుడు లోతుగా ధ్యానం ఆచరించడం ద్వారా జ్ఞానోదయం పొందారు.

ధ్యానం వల్ల ప్రయోజనాలు

ధ్యానం వల్ల రక్తపోటు నియంత్రణ, రోగ నిరోధకశక్తి పెరగడం, దీర్ఘకాలిక నొప్పులు తగ్గడంతో శారీరక ఆరోగ్యం పొందుతారు. మానసిక, శారీరక శ్రేయస్సుకు ధ్యానం ఉపకరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ధ్యాన సాధకులు డిసెంబర్‌ 21న హైదరాబాదు శివారు హార్ట్‌ఫుల్‌నెస్‌ ప్రధాన కార్యాలయం కన్హా శాంతివనంలో ధ్యానం చేయనున్నారు. ప్రత్యక్షంగా 40 వేల మంది, పరోక్షంగా లక్షలాది మంది ఈ అభ్యాసంలో పాల్గొంటారు.

ధ్యానం, యోగా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ధ్యానం.. మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుపై దృష్టిపెడుతుంది. ధ్యానంతో శరీరం, ఆత్మ, మనసుల మధ్య సమతుల్యత పెరుగుతుంది. వ్యక్తిగత సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం ధ్యానం చేయడానికి సమయం కేటాయించాలి. ధ్యాన ప్రధాన కార్యశాలలను నిర్వహించాలి. కమ్యూనిటీ ధ్యాన శిబిరాలను ఏర్పాటుచేయాలి. ధ్యాన ప్రక్రియ గురించి ప్రచారం చేయడం, సోషల్‌ మీడియా వేదికగా ధ్యాన ప్రాధాన్యాలను వివరించడం వంటివి చేయాలి.

(డిసెంబర్‌ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా)

  • ఆచార్య బుర్ర మధుసూదన్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News