- పంజాబ్లోని పాక్ సరిహద్దుల్లో బండి పర్యటన
- సరిహద్దు గ్రామాల్లో వరదబాధితులకు పరామర్శ
- వారిని ఆదుకుంటామని మంత్రి సంజయ్ హామీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పంజాబ్ లోని అమృత్సర్ విచ్చేసిన కేంద్ర మంత్రి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు గురుదాస్ పూర్ జిల్లాలోని భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను సందర్శించారు. ఇటీవల వచ్చిన భారీ వరదల పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 23 జిల్లాలు వరద ప్రభావితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,097 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. 3,88,092 మంది ప్రజలు వరదలవల్ల నష్టపోయారు. 56 మంది మరణించారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇదులో దాదాపు 3 లక్షల ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిన్నది. భారీగా ఆస్తి, పశు సంపద నష్టం సంభవించింది. 10 వేలకు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు పంజాబ్ లో వరదలతో గురుదాస్ పూర్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది.
ఈ జిల్లాలో 329 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే 1.45 వేల మంది ప్రజలు నిరాశ్రయుల య్యారు. 87 వేల 569 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురుదాస్ పూర్ జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా ఈ జిల్లా భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న 11 గ్రామాలను సందర్శించారు. డేరాబాబాద్ నానక్ ప్రాంతంలోని సంగ్లీ, ఘనియక్ బేట్, గురుచుక్, సమురాయ్, తపాలా, రన్ సేక్ తల్లాన్, డాబుర్జీ, ధర్, రహమద్ బాద్, మషాలా, నబీ నగర్, బరై గ్రామాలు ఇందులో ఉన్నాయి. తొలుత సంగ్లీ గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామం పూర్తిగాట బీఎస్ ఎఫ్ అధికారుల పహారాలో ఉంది. వరదలవల్ల ఈ గ్రామ ప్రజల ఇండ్లల్లోకి దాదాపు 20 అడుగుల మేరకు నీళ్లు వచ్చాయని, బాధితులందరికీ సురక్షితంగా పునరావాసా కేంద్రాలకు తరలించి భోజన, వసతిసహా కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈ సదర్భంగా బీఎస్ఎఫ్ అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వివరించారు. వారితో కలిసి దేశ సరిహద్దు ఫెన్సింగ్ వరకు వెళ్లారు. ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
బైనాక్యులర్స్ ద్వారా వరద ముంపు ద్రుశ్యాలను వీక్షించారు. ఫెన్సింగ్ అవతలి వైపు పాకిస్తాన్ సైనికులు ఎవరూ కన్పించకపోవడంతో ఇదే విషయాన్ని బీఎస్ఎఫ్ సిబ్బందిని అడిగారు. వరదలు రావడంతో సరిహద్దుకు ఆవతల గస్తీ కాస్తున్న పాకిస్తాన్ సైనికులు పత్తా లేకుండా పోయారని తెలిపారు. వెంటనే కేంద్ర మంత్రి స్పందిస్తూ వానలు, వరదలను లెక్క చేయకుండా నిరంతరం గస్తీ కాయడమే కాకుండా బాధితులను రక్షిస్తూ వారికి అన్ని విధాలా అండగా ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం సంగ్లీ గ్రామ రైతులను కలిశారు. వారి బాధలను విన్నారు. అక్కడి నుండి నేరుగా గురుచుక్ వెళ్లారు. రావి నది వరదలతో ఆ గ్రామంలోని పంటలన్నీ పూర్తిగా ధ్వంసమవడమే కాకుండా కిలోమీటర్ల మేరకు ఆ భూముల్లో మేటలు వేసి సాగుకు పనికి రాకుండా పోయిన ద్రుశ్యాలను చూశారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారు పడుతున్న బాధలను, జరిగిన నష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారా? లేదా? అని అడిగితే ‘ఒక్క మంత్రి, అధికారి కానీ ఇంతవరకు తమ గ్రామంలోకి అడుగు పెట్టలేదని స్థానిక రైతులు వాపోయారు. ఈ గ్రామంలో పర్యటిస్తున్న తొలి మంత్రి మీరేనని, కేంద్రమే ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. రెండేళ్లపాటు పంటలు సాగు చేసుకోవడానికి కూడా భూములు పనికిరావని, అన్ని విధాలా సాయం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి పర్యటించిన ఇతర గ్రామాల్లోనూ ప్రజలంతా దాదాపు ఇదే బాధను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా గురుచుర్, సమురయ్, ఘనియక్ బేట్, రన్ సేక్ తల్లాన్ గ్రామాల ప్రజలతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆయా గ్రామాల్లోని వరద బాధితులకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, మసాలా దినసులతో కూడిన ‘మోడీ కిట్ల’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా అందజేశారు. అనంతరం ఆయా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
వరద ముంపు బాధితులు తీవ్రమైన కష్టాల్లో ఉన్న విషయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాలతోనే పంజాబ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. నష్టపోయిన పంజాబ్ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల తక్షణ సాయం విడుదల చేసినట్లు తెలిపారు. ఇవిగాకుండా రూ.1200 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు సైతం రాష్ట్రం వద్దే ఉన్నాయని గుర్తు చేశారు. వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్థి, పంట, ఇతరత్రా నష్టాల పైనా పూర్తి నివేదిక వచ్చాక ప్రజలకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిరాశ్రయులకు తక్షణ సాయంగా బియ్యం, పప్పు, ఉప్పు, మసాల దినుసులతో కూడిన ‘మోడీ కిట్స్’ ను అందిస్తున్నట్లు తెలిపారు. వరదలవల్ల పంజాబ్ కు ముఖ్యంగా గురుదాస్ పూర్ జిల్లాకు జరిగిన నష్టాన్ని ప్రధానమంత్రి సరేంద్రమోడీకి నివేదించబోతున్నట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడం బాధాకరమన్నారు. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు ఆధైర్యపడొద్దని, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మోడీ ఆదేశాల మేరకు ఆ భరోసా ఇచ్చేందుకే తాను పంజాబ్ కు విచ్చేసినట్లు వివరించారు.
