ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వలలో పడకండి
గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రండి
పీజీ సీట్ల పెంపు, అందుబాటులో ఫీజులపై ప్రభుత్వాలు ఆలోచించాలి
అమ్మ జన్మనిస్తే.. డాక్టర్ పునర్జన్మ ఇస్తాడు..
వైద్య విజ్ఞానంపై అప్‌డేట్ కాకపోతే డాక్టర్ మాత్ర వైకుంఠ యాత్రే
నాపై 109 కేసులున్నాయ్ కాబట్టే హోం శాఖ సహాయ మంత్రినయ్యా
ప్రతిమ మెడికల్ కాలేజీ 24వ వార్షికోత్సవంలో బండి సంజయ్ వ్యాఖ్యలు
అమ్మ(Mother) జన్మనిస్తే(Birth).. డాక్టర్లు(Doctor) పునర్జన్మ ఇస్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి(Union Minister of State for Home Affairs) బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. అందుకే డాక్టర్లను దైవంగా కొలుస్తామని చెప్పారు. అంత పవిత్రమైన వృత్తిలో కొనసాగబోయే వైద్య విద్యార్థులంతా భవిష్యత్తులో ఫార్మా కంపెనీల, డయాగ్నస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. నిరంతరం వైద్య విజ్ఞానంలో మార్పులు వస్తూనే ఉంటాయని, ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ మాదిరిగా డాక్టర్లుగా మారితే ‘డాక్టర్ మాత్ర రోగుల పాలిట వైకుంఠ యాత్ర’ అవుతుందని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ(Prathima Medical College) 24వ వార్షికోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..
ప్రతిమ మెడికల్ కాలేజీతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ప్రాంతంలో మంచి పేరున్న కాలేజీ ఇది. 24 ఏళ్లలో ప్రతిమ కాలేజీ ఎంతో ఎత్తుకు ఎదిగి ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రసాదమైంది. గర్భిణిలకు ‘తల్లీ బిడ్డ సంక్షేమ పథకం’ కింద కేవలం 2 వేల రూపాయలు చెల్లిస్తే ప్రెగ్నెన్సీ నుంచి డెలవరీ వరకు పూర్తి స్థాయిలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటోంది. విద్య, విలువలకు నిదర్శనం ప్రతిమ. అందుకే ఇక్కడ మెడికల్ సీటుకు డిమాండ్ ఉంది.
ఎంబీబీఎస్ కోర్సు ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ కాదు. 5 ఏళ్ల టెస్ట్ మ్యాచ్. మెడికల్ సబ్జెక్టులు అర్థంకాక నిద్రలేని రాత్రులు, నోట్స్‌తో కుస్తీల వల్ల మెడికల్ స్టూడెంట్ జీవితం కంటికి కన్పించని శత్రువుతో యుద్ధం లాంటిది. మిగతా విద్యార్థులు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే మీరు రాత్రింబవళ్లు చదువులతో బ్రెయిన్ ఓవర్‌లోడ్ అవుతుంది. అసలు మనకు ఇంత స్ట్రెస్ అవసరమా? అనే భావన కలుగుతుంది. ఇది అవసరమే. ఎందుకంటే మీ దగ్గరకొచ్చే పేషెంట్లు.. ‘డాక్టర్.. నన్ను బతికించండి’అని అంటారు. అందువల్ల.. ప్రాణం పోసి బతికిస్తే అంతకంటే కావాల్సిందేముంది?
అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మ ఇస్తాడు. అందుకు నిదర్శనం నేనే. గతంలో నేను ర్యాలీ తీస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయా. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళితే 12 సార్లు షాక్‌లు ఇచ్చారు. 5 రోజులు ఐసీయూలో ఉంచి కాపాడారు. అందుకే కరీంనగర్‌లో డాక్టర్లంటే నాకు అభిమానం. వాళ్లను కాపాడుకుంటా. అంత గొప్ప వృత్తిలోకి అడుగు పెట్టబోయే మీరంతా ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఇచ్చే ఆఫర్లకు లోనై వారి వలలో పడితే ప్రజలకు అన్యాయం చేసినవారవుతారు. కొవిడ్‌ను ఆసరా చేసుకొని కోట్లు సంపాదించిన ఆసుపత్రులెన్నో ఉన్నాయి. డబ్బులు చెల్లించకపోతే పేషెంట్ల ప్రాణాలను కాపాడకుండా గాలికి వదిలేశాయి. కాబోయే డాక్టర్లంతా ఈ వృత్తిని వ్యాపారంగా కాకుండా మంచి ఆలోచనతో ప్రజలకు వైద్య సేవలందించి ఆరోగ్య భారత్ నిర్మాణానికి సహకరించాలి.
ప్రజాస్వామ్య దేశంలో విద్య, వైద్యం రెండూ ప్రభుత్వాల బాధ్యతే. దురదృష్టవశాత్తూ 1947 నుంచి విద్య, వైద్యాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. మన దేశంలో సరిపడా ఆసుపత్రులు లేవు. 2025 లెక్కల ప్రకారం.. డబ్ల్యూహెచ్ గణాంకాలను బట్టి.. వెయ్యి మందికి 4 బెడ్లు ఉండాలి. మన దగ్గర 1.5 బెడ్ మాత్రమే ఉంది. 140 కోట్ల జనాభాకు సరిపడా బెడ్లు లేవు. ఇండియాలో 70 వేల ఆసుపత్రులున్నాయి. 26 వేల ప్రభుత్వ, 43 వేల ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్య బాగానే ఉంది.
WHO ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. మన దగ్గర 1200 మందికి ఒక డాక్టర్ ఉన్నడు. పెద్ద తేడా లేదు. మన దేశంలో దాదాపు 14 లక్షల మంది మెడికల్ ప్రాక్టీసనర్స్, మరో 20 లక్షల మంది ఆయుష్, యునానీ డాక్టర్లున్నారు. కానీ.. ఆ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంతా ఎక్కువగా అర్బన్ సెంటర్లకే పరిమితమవుతున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అర్బన్‌కే పరిమితమయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ అసమానత పోవాలంటే.. ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్లు కూడా తమ పిల్లలకు అవసరమైన విద్య, ఇతర సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉన్నాయన్పిస్తే అక్కడ పని చేయడానికి సిద్దపడతారు. అప్పుడే ఈ అసమానత పోతుంది. డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావాలి.
ఎంబీబీఎస్ అయ్యాక పీజీ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్‌లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఫీజు చెల్లించే స్తోమతలేక ఉన్నత చదువుకు చాలా మంది దూరమవుతున్నారు. దీనిపై అందరం చర్చించి ఓ విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏ ఫీల్డ్‌లోనైనా కష్టపడి నిజాయితీగా సేవలందిస్తే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. రాజకీయాల్లో ప్రజలకు సేవలందిస్తూ కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రినయ్యా. ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల నాపై 109 కేసులు పెట్టారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షా ఎదుట అడిగితే.. అందుకే సంజయ్ కేంద్ర హోం శాఖకు సహాయ మంత్రి అయ్యారని అన్నారు. మీరు కూడా డాక్టర్ వృత్తిలో నిబద్దతతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా.
