Monday, October 27, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంGHMC: బల్దియా.. బరితెగించింది!

GHMC: బల్దియా.. బరితెగించింది!

కంచే చేను మేసింది

నవయుగ అక్రమాలకు అండదండలు… హెచ్ఎంసీ చట్టం 1955 బుట్టదాఖలు!
అనుమతి లేని సర్వే నంబర్ నిర్మాణం..
‘దొంగలు దొంగలు’ కలిసినట్లు నవయుగ, అధికారుల బంధం.
అక్రమం వాస్తవమేనని తహశీల్దార్ నివేదిక ఇచ్చినా..
‘చెవిటోడి ముందు శంఖం’లా మారిన అధికారుల తీరు.
చేతులు ముడుచుకు కూర్చున్న ప్రణాళికా విభాగం.
రక్షకులే భక్షకులైతే ఎవరికి చెప్పుకోవాలి?
ప్రభుత్వమా.. మేలుకో! అవినీతి అధికారులపై కొరడా ఝుళిపించకుంటే.
ఇక పరిపాలన కుక్క తోక పట్టి గోదారి ఈదినట్లే….

“నవయుగ” చట్ట విరుద్ధంగా చేస్తున్న అరాచకంపై ‘ఆదాబ్ హైదరాబాద్’ దినపత్రికలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ అక్రమాలపై ప్రచురితమైన కథనంతో జీహెచ్ఎంసీ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి నిర్వాకం ఇప్పుడు ‘వీధివీధికీ వెలుగులోకి’ వచ్చింది. అనుమతి ఒక సర్వే నంబర్లో తీసుకుని, పక్కవాడి పట్టా భూమిలో నిర్మాణం చేపట్టడం చూస్తుంటే, “దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు” నవయుగ సంస్థ, కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టమవుతోంది.

చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు… రెవెన్యూ నివేదిక!

ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందడంతో, బేగంపేట డిప్యూటీ కమిషనర్ బాలనగర్ తహసిల్దార్కు లేఖ రాశారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, “అయ్యా, నిర్మాణం జరుగుతున్నది అనుమతి లేని సర్వే నంబర్ 182లోనే” అని తేల్చి నివేదిక ఇచ్చారు. కానీ, మన ప్రణాళిక విభాగం అధికారులకు ఆ నివేదిక “చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు” మారింది. వాస్తవాలను పక్కనపెట్టి, స్వప్రయోజనా లకే పెద్దపీట వేశారు. వారి దృష్టిలో చట్టం, న్యాయం “నీటి మీద రాతల్లా” మారిపోయాయి.

చట్టాలున్నాయి… కానీ పట్టించుకునేటోడు ఏడి?

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (హెచ్ఎంసీ) చట్టం, 1955 ప్రకారం ఇది ఘోరమైన ఉల్లంఘన. ఇలాంటి అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, నోటీసులు ఇచ్చి, కూల్చివేయాలి. భారీ జరిమానాలు విధించి, యజమానులపై క్రిమినల్ కేసులు శరవేగంగా జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులు కూడా పెట్టవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? చర్యలు తీసుకోవాల్సిన అధికారులే “చేతులు ముడుచుకుని కూర్చు న్నారు”. ఇది కేవలం నిర్లక్ష్యమా లేక “చేతులు మారితే రాతలు మారతాయన్న” వ్యవహారమా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం… సామాన్యుడికి శాపం!

రక్షించాల్సిన అధికారులే ఇలా భక్షకులుగా మారితే, సామాన్యుడి గతేంటి? ఈ అక్రమ నిర్మాణం వల్ల పక్కనే ఉన్న భూ యజమాని సర్వ హక్కులు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయన గోడు ఎవరికి చెప్పుకోవాలి? “ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు” అన్నట్లు, వ్యవస్థలోనే లోపం ఉంటే సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకమానదు.

ప్రభుత్వం మేల్కోవాలి… లేదంటే మొదటికే మోసం!

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, “నవయుగ” వంటి సంస్థలకు కొమ్ముకాస్తున్న అవినీతి అధికారులపై కొరడా ఝుళి పించాలి. సమర్థులైన అధికారులను ప్రోత్సహించి, వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. లేకపోతే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. “కుక్క తోక పట్టి గోదారి ఈదలేరు” అన్నట్లు, ఇలాంటి అధికారులను అండగా పెట్టుకుని సుపరిపాలన అందించడం అసాధ్యం. దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News