ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల(Poor People) మేలు కోసం జీవితాంతం(Lifelong) కృషి చేసిన మహోన్నత వ్యక్తి(Great Man) బాబా ఆమ్టే. సంఘ సేవకుడి(Community Servant)గా ప్రసిద్ధి గాంచిన ఆయన ముఖ్యంగా కుష్ఠు రోగుల పాలిట దేవుడి(God For Leprosy Patients)గా పేరొందారు. ఆమ్టే.. భారతీయ సామాజిక కార్యకర్త. లక్ష్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. సామాజిక సేవనే పరమావధిగా భావించి, జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి. కుష్ఠు రోగుల సేవల కోసం చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని(Anandvan Ashram) స్థాపించారు. వారితోపాటే ఆయన కూడా అక్కడే జీవితాన్ని గడిపి 2008 ఫిబ్రవరి 9న కన్నుమూశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.
బాబా ఆమ్టే పూర్తి పేరు.. బాబా మురళీధర్ దేవదాస్ ఆమ్టే. 1914 డిసెంబర్ 26న మహారాష్ట్ర వార్థా జిల్లా హింగన్‌ఘాట్‌లోని ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించారు. బాబా అనేది తల్లిదండ్రులు పెట్టిన ముద్దు పేరు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తర్వాత వార్థాలో న్యాయభ్యాసం ప్రారంభించారు. అదే సమయంలో జాతీయోద్యమం జరుగుతుండేది. క్విట్ ఇండియా పోరాట సమయంలో అరెస్ట్ అయిన జాతీయ నేతల తరఫున కోర్టుల్లో వాదించేవారు. క్రమంగా మహాత్మాగాంధీకి ఆకర్షితులయ్యారు. గాంధీజీతోపాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపారు. జీవితాంతం గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడ్డారు. వేషధారణలోనూ గాంధీజీ మాదిరిగానే ఖద్దరు దుస్తులనే వాడేవారు. గాంధీజీలాగే జీవితాంతం అణగారిన వర్గాల కోసం కృషి చేశారు.
బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్ఠు రోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించారు. ఆనంద్‌వన్‌ను వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. అది క్రమక్రమంగా పెద్దదై 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజుల్లో కుష్ఠు రోగులను సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటివారి కోసం ఆశ్రమాన్ని స్థాపించి, వారిని చేరదీసి, వారితోనే గడపటం విశేషం. కుష్ఠు అనేది ఒక అంటు వ్యాధి. ఆ రోగులను తాకినా కుష్ఠు వస్తుందనే ప్రచారం అప్పట్లో జరిగేది. ఆ సమయంలో బాబా ఆమ్టే ఆ వదంతులను తిప్పి కొట్టడానికి స్వయంగా ఒక కుష్ఠు రోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నారు.
కుష్ఠు రోగుల కోసం బాబా ఆమ్టే తదనంతరం సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించారు. సమాజ సేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కోసం బాబా ఆమ్టేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థ నుంచి డేమియన్ డట్టన్ అవార్డు లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ 2 ఆసుపత్రులను, విశ్వ విద్యాలయాన్ని, అంధుల పాఠశాలను, అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆశ్రమంలో 5 వేల మందికి పైగా నివసిస్తున్నారు.
బాబా ఆమ్టే.. గాంధీజీ సిద్ధాంతాలను నమ్మటమే కాదు. పూర్తిగా ఆచరించిన వ్యక్తి. గాంధీజీతో పరిచయమైన తర్వాత ఆయనతోపాటు కొద్ది రోజులు సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపారు. గాంధీజీ శిష్యుడిగా మారి ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంట బట్టించుకున్నారు. కుష్ఠు రోగులను చూసి భయపడకుండా వారి సంక్షేమానికి చేస్తున్న కృషికి బాబా ఆమ్టేకు గాంధీజీ.. “అభయ సాధక్” అనే బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత బాబా ఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేష జీవితం అణగారిన వర్గాల కోసం గడపడమే కాకుండా వస్త్ర ధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం వంటి విషయాల్లో ఇద్దరి మధ్య సారూప్యముంది. అంతేకాదు. ఆశ్రమాల్లో ఉంటూ పూర్తిగా శాకాహారమే తింటూ జీవనం గడిపారు.
గాంధీజీ లాగే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించారు. గాంధీజీ బ్రిటిష్‌వారిపై అహింసా పోరాటం జరిపితే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించారు. తుది శ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటు పడి తన ఆశయమే లక్ష్యంగా కృషి చేసి 2008 ఫిబ్రవరి 9న తన ఆశ్రమం ఆనంద్‌వన్‌లో బాబా ఆమ్టే 94 ఏళ్ల వయసులో చనిపోయారు.
అనేక దశాబ్దాల పాటు దీన జనుల కోసం కృషి చేసిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతోపాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించారు. 1971లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు, 1974లో మహారాష్ట్ర ప్రభుత్వం దళిత్ మిశ్రా అవార్డు, 1978లో రాష్ట్రీయ భూషణ్ అవార్డు, 1979లో జమన్‌లాల్ బజాజ్ అవార్డు, 1983లో అమెరికాకు చెందిన డామియెన్ డట్టన్ అవార్డు (కుష్ఠు వ్యాధి పీడితుల కోసం కృషి చేసిన వారికిచ్చే ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు), 1985లో రామన్ మెగ్సేసే అవార్డు, 1985లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ స్మారక అవార్డు వచ్చింది.
1986లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు, 1986లో రాజారాంమోహన్ రాయ్ అవార్డు, 1988లో ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల అవార్డు, 1988లో జి.డి.బిర్లా అంతర్జాతీయ అవార్డు, 1988లో ఫిక్కి అవార్డు, 1989లో అంతర్జాతీయ జిరాఫీ అవార్డు, 1990లో టెంపుల్టన్ అవార్డు, 1991లో రైట్ లివ్లీ హుడ్ అవార్డ్(ఈ అవార్డు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందింది), 1991లో ఆదివాసీ సేవక్ అవార్డు, 1992లో మహారాష్ట్ర ప్రభుతం అంబేద్కర్ దళిత్ మిత్ర అవార్డు, 1997లో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ అవార్డు, 1999లో గాంధీ శాంతి బహుమతి, 1999లో అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు, 2008లో భారత్‌వాసా అవార్డు లభించాయి.
(డిసెంబర్ 26న బాబా మురళీధర్ దేవదాస్ ఆమ్టే జయంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
