భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట, డిసెంబర్ 1 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ తిరుపతి(Telangana Tirupati)గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం(Lakshminarasimha swami Temple)లో ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం ప్రత్యేకంగా అయ్యప్ప స్వాము(Ayyappa Swami)లు నిర్వహించబడిన గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
వేకువజామునే గిరిప్రదక్షిణ (Giripradakshina) చేయడానికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో రింగ్ రోడ్డు దగ్గర ఉన్న వైకుంఠ ద్వారం కిక్కిరిసింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.. స్వామి వారికి హారతిచ్చి, కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభించారు.

అంతకుముందే వేకువజామున వేలాది మంది అయ్యప్ప భక్తులు గిరి ప్రదక్షణకి సిద్ధమయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు తరలిరావడం వల్ల యాదాద్రి మెట్ల దారి, రింగ్ రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. వందల వాహనాలతో వైకుంఠ ద్వారం, పాత హైస్కూల్ గ్రౌండ్ పోటెత్తింది. బాజా భజంత్రీలతో, భజనలతో అయ్యప్ప భక్తులు పాటలు పాడుతూ, ధ్యానంలో లీనమై మరో శబరిమలను తలపించారు. గోవింద నామస్మరణలు, అన్నమయ్య కీర్తనలు, కోలాట ప్రదర్శనల నడుమ కొండ చుట్టూ భక్తులు చేసిన గిరి ప్రదక్షిణ ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది.
దాదాపు 15 వేల మంది అయ్యప్ప స్వాములు గిరి ప్రదర్శన పాల్గొన్నట్లు గురుస్వాములు ప్రకటించారు. సహకరించిన దేవస్థాన ఈవో వెంకటరావుకు, యాదగిరిగుట్ట పట్టణ పోలీసు సిబ్బందికి, ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గిరిప్రదక్షిణకు సంబంధించి ఆలయ అధికారులు దారిలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు, గురు స్వామి శ్రీనివాస్, రేకల రాజు, తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములకు ప్రత్యేక దర్శనాలకు అనుమతి
యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న 15 వేల మంది అయ్యప్ప స్వాములకు దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా స్వయంభు మూర్తులను దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దర్శనానంతరం అయ్యప్ప భక్తులకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో వచ్చి గిరి ప్రదక్షిణను ఘనంగా నిర్వహించి యాదాద్రి ఖ్యాతిని పెంచిన స్వాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
