- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వచ్చే సోమవారం నుంచి, అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమం నిర్వహణపై, సీఎస్ రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రజలెందరో ప్రాణాలు కోల్పోతున్నారని, అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించవలసిన అవసరం ఉందన్నారు. డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి, రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అధికారులతో కలిసి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 వ తేది నుంచి నిర్వహించే అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 13వ తేదీన గ్రామీణ స్థాయిలో, గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.


గ్రామాల్లో తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఏమైనా ఉంటే గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వారం రోజులపాటు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగేలా విద్యార్థులచే ర్యాలీలు, మండల స్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులకు కంటి పరీక్షలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. అన్ని కార్యక్రమాలలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున భాగ్యస్వామ్యం చేయాలని అన్నారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, డిఇఓ భోజన్న, డిఎంహెచ్వో రాజేందర్, జెడ్పీ సీఈవో శంకర్, డిసిఎస్ఓ రాజేందర్, డిపిఆర్ఓ విష్ణు వర్ధన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
