Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణవిపత్తు సమయంలో ‘‘ఆపద మిత్ర’’

విపత్తు సమయంలో ‘‘ఆపద మిత్ర’’

వాలంటీర్లు ముందుండాలి – కలెక్టర్‌ పమేలా సత్పతి

ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌. సి. సి వాలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న ఆపదమిత్ర శిక్షణను గురువారం బీసీ స్టడీ సర్కిల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ అవగాహన లేకపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదం జరిగే అవకాశాలను ముందుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రమాదాలు ఎదుర్కునేందుకు మొదటిదఫాలో గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రెండవ దఫాలో డిగ్రీ కళాశాల స్థాయి, ఎన్‌. సి. సి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

ఆపదమిత్ర శిక్షణలో భాగంగా ఫైర్‌, పోలీస్‌, పంచాయతీరాజ్‌, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ, సైబర్‌ తదితర అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క పాటు, అగ్నిప్రమాదం, సిపిఆర్‌, షాట్‌ సర్క్యూట్‌, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణను ఇవ్వనున్నామని అన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆపదమిత్ర శిక్షణ తీసుకున్న వారు ప్రమాదాల నివారణకు ముందుంటారని తెలిపారు. నైపుణ్యాలతో కూడిన ఆపదమిత్ర శిక్షణ వల్ల తమను రక్షించుకోవడంతో పాటు పది మంది ప్రాణాలు కాపాడగలరని పేర్కొన్నారు. శిక్షణకు హాజరైన వారు నేర్చుకున్న నైపుణ్యాలను, మెళకువలను మరో పదిమందికి నేర్పించాలని సూచించారు. ఆపద ఎప్పుడైనా రావచ్చని, ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News