ఏపీ మంత్రి (AP Minister) నారా లోకేష్ (Nara Lokesh) కెనడా(Canada)లోని టొరంటో(Toronto)కు వెళ్లారు. అక్కడి బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు & CEO గోల్డీ హైడర్‌తో మీటింగ్ అయ్యారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అనేది.. 2.1 మిలియన్లకు పైగా కెనడియన్లకు ఉపాధి కల్పిస్తున్న 170కి పైగా వ్యాపారాలకు ప్రధాన వ్యాపార మండలి. ఏపీలో కేవలం 18 నెలల్లో రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన అంశాన్ని గోల్డీకి తెలిపారు. ఏపీలోకి కెనడియన్ వ్యాపారాలను ఆహ్వానించడానికి ఎదురుచూస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, AIలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఓపెన్‌టెక్‌స్ట్ సంస్థను నారా లోకేష్ సందర్శించారు. ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో సమావేశమయ్యారు. ఏపీలోని ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, నెక్‌స్ట్-జెన్ డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఓపెన్‌టెక్‌స్ట్‌ను ఆహ్వానించారు. ప్రపంచ స్థాయి సామర్థ్యాలతో మన యువతను సన్నద్ధం చేయడానికి, ఉమ్మడి నైపుణ్య అభివృద్ధి & ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలనూ ప్రతిపాదించారు. అయితే.. టైర్-2 నగరాల్లోకి విస్తరించడంపై ఓపెన్‌టెక్‌స్ట్ ఆసక్తి కనబరచడం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు.
అంతకుముందు.. టొరంటోలోని కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB)కు చెందిన టిమ్ డౌనింగ్‌తో లోకేష్ భేటీ అయ్యారు. దేశ పునరుత్పాదక ఇంధన కేంద్రంగా ఏపీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓడరేవులు, లాజిస్టిక్స్, టోల్ రోడ్లు & అమరావతి పట్టణ మౌలిక సదుపాయాలతోపాటు సౌర, పవన & గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలని CPPIBని కోరారు.
టొరంటోలో ప్రేమ్ వాట్సాతో కూడా నారా లోకేష్ సమవేశమయ్యారు. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయ పెట్టుబడిదారుల్లో ఆయన ఒకరు. 30 బిలియన్ డాలర్లు+ మార్కెట్ క్యాప్ కలిగిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు దార్శనికుడు. ఆయన ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం, NSE & సన్మార్ కెమికల్స్ వంటి వాటికి సపోర్టివ్‌గా వ్యవహరించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై నారా లోకేష్.. ప్రేమ్ వాట్సాతో చర్చించారు. ఏపీ వృద్ధి కథలోకి ఫెయిర్‌ఫాక్స్‌ను స్వాగతించడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
