Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆదాబ్ ప్రత్యేకం111 జీవోలో అన్విత బిల్డర్స్ అక్రమ వెంచర్

111 జీవోలో అన్విత బిల్డర్స్ అక్రమ వెంచర్

  • ప్రెజర్వ్ ఫార్మ్స్ పేరుతో దగా చేస్తున్న సంస్థ
  • త్రిబుల్ వన్ జీవోకు తూట్లు పొడుస్తున్న అక్రమ వెంచర్‌లు
  • జీవో పరిధిలోని గ్రామాల్లో వెలుగు చూస్తున్న మోసపూరిత ల్యాండ్ అమ్మకాలు
  • అక్రమార్కుల చేతుల్లో మాయమవుతున్న వ్యవసాయ భూములు
  • ఫార్మ్ ల్యాడ్ పేరుతో అమాయక ప్రజలు మోసపోతున్న వైనం
  • అధికారులతో కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నారంటూ స్థానికుల ఆరోపణలు
  • జీవోకు రక్షణ ఉండాల్సిన అధికారులు ఎందుకు చర్యలకు వెనకడుతున్నారు
  • అక్రమ వెంచర్‌లకు అడ్డుకట్ట అఢ్డు వేయడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్ లోని జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను కాపాడే నేపథ్యంలో 1990 దశకం నుంచి అమలులోకి వచ్చినటువంటి 111 జీవో నేడు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉల్లంఘనకు గురవుతూ వస్తోంది . జీవోకు తూట్లు పొడుస్తున్న అన్విత బిల్డర్స్ పై చర్యలకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలకు నోచుకోవడంలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రెజర్వ్ ఫార్మ్స్ పేరుతో అమాయక ప్రజలకు భూముల విక్రయాలు. ఎవరి అండా లేకుంటే దశాబ్దాలుగా రక్షించబడుతున్న జీవో పరిధిలోని వ్యవసాయ భూములు ఇలా వెంచర్‌లకు ఎలా నెలవవుతాయి… ఏం జరుగుతున్న చోద్యం చూస్తున్నట్లుగా మున్సిపల్ అధికారుల తీరు ఎన్నో అనుమాలకు దారితీస్తుంది. ప్రకృతి పరవశం అంటూ వెంచర్‌లలో విల్లాల నిర్మాణాలంటూ కొనుగోలుదారులను మభ్యపెడుతున్న అన్విత బిల్డర్స్. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉంటే తప్పా ఇలాంటి వ్యవహారాలకు తావు ఉండదటున్న సామాజిక వేత్తలు అనుమానం వ్యక్త పరుస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి.. టంగుటూరు గ్రామాల్లో అన్విత బిల్డర్స్ చేస్తున్న దురాక్రమణ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

త్రిబుల్ వన్ జీవోకు తూట్లు పొడుస్తున్న అన్విత బిల్డర్స్..
దశాబ్దాల పాటు కాపాడుతూ వస్తున్నటుంటి జీవో 111 పరిధిలోని భూములు ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో ఉనికిని కోల్పోతున్నాయి. అన్విత బిల్డర్స్ అనే సంస్థ హ్యాపీనెస్ ప్రెజర్వ్ ఫార్మ్స్ పేరుతో, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి, టంగుటూరు గ్రామాల్లో 111 జీవోలో పేర్కొనటువంటి నిబంధనలు, పరిమితులు అన్నింటిని తుంగలో తొక్కి ఫార్మ్ ల్యాండ్ అమ్మకాలు చేపడుతోంది. దీంతో జీవోకు ఆసంస్థ తూట్లు పొడిచినట్లయింది. విలాసవంతమైన భవనాల పేర్లతో అమాయకులైన ప్రజలను దగా చేస్తోంది. యథేచ్ఛగా 111 జీఓను ఉల్లంఘిస్తూ సర్వే నెంబర్లు : 143, 146, 147, 148, 149, 151, 152 లలో అదే విధంగా టంగుటూరు గ్రామంలో సర్వే నెం: 440లో అక్రమంగా ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం చేస్తోంది. విక్రయాలతో పాటు ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తుంది. నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకుంది. దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ శ్రీనివాస్ రావు ఈ దారుణాన్ని గుర్తించి వెలుగులోకి తెచ్చారు. సమాచారం సేకరించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఈ భూమి మొత్తం విస్తీర్ణం 54 ఎకరాలు కాగా దాదాపు 270 ఫార్మ్ ప్లాట్లు ఉన్నాయి. 2 ఎకరాలతో క్లబ్ హౌస్‌తో బాటు అత్యంత ఆధునీకరమైన సౌకర్యాలతో ల్యాండ్ స్కెపింగ్, విశాలమైన అంతర్గత రహదారులు నిర్మిస్తామని చెబుతూ అమాయకులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వీరు చెబుతున్నట్టుగా ఈ నిర్మాణాలు చట్ట విరుద్ధం. ఇవ్వన్నీ 111 జీఓ పరిధిలోకి వస్తాయి.. “బిల్డింగ్ హ్యాపినెస్ – ది ప్రిజర్వ్” అని ప్రచారం చేసుకోవడం చట్ట విరుద్ధం.. ఇలా అక్రమంగా వెంచర్స్ వెస్తూ పోతే పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుంది. అదే విధంగా హైదరాబాద్ మహానగర మంచినీటి అవసరాలకు అంతరాయం కలిగిస్తుంది.

జీవో 111 నేపథ్యం..
హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు ఈ జలాశయాలే హైదరాబాదీల తాగు నీటి అవసరాలను తీర్చేవి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ జలాశయాలను కాపాడుకోవడం కోసం.. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఈ జలాశయాల్లోని నీరు కలుషితమైతే.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే కారణంతో ఈ జీవోను జారీ చేశారు.

జీవో 111 విస్తీర్ణ పరిధి…నిబంధనలు
ఈ జీవో ప్రకారం.. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది దాదాపు జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయేతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలోని జీవో 111 పరిధిలోని భూముల్లో 90 శాతం పరిరక్షణ మరియు వినోదం కోసం, వ్యవసాయం మరియు తోటపనికి పరిమితం. మిగిలిన 10 శాతం నివాస వినియోగానికి పరిమితులతో, 60 శాతం రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాలకు మరియు భవనాలకు 50 శాతం ప్రాంతానికి పరిమితం. ఇది అభివృద్ధిని సమతుల్యం చేయడం మరియు బహిరంగ ప్రదేశాలను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు బ్రేక్ పడింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది వ్యాపారవేత్తలు, పొలిటిషియన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. 111 జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ వందల సంఖ్యలో ఫామ్ హౌసులు, విల్లాలు వెలిశాయి.

అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు..చర్యలు శూన్యం
అన్విత బిల్డర్స్ జీవో 111లో చేస్తున్న అక్రమాలపై సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసిన ట్రెసా ప్రెసిడెంట్ తమ అభ్యర్ధనలో పలు విషయాలు తెలియజేశారు.. దానితోపాటు పలు డిమాండ్లు కూడా ముందుంచారు.. అవి.. ఇక్కడ జరుగుతున్న అన్ని నిర్మాణాలు, విక్రయ ప్రకటనలను నిలిపివేయమని స్టాప్-వర్క్ నోటీస్ జారీ చేయాలి. ఎంఆర్ఓ/ఆర్డీవోలను సైట్ ఇన్స్పెక్షన్‌కు పంపించి నివేదిక సమర్పింప చేయాలి. జిల్లా కలెక్టర్ సుమోటోగా స్వీకరించి చర్య తీసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖతో సమన్వయం చేసి, చట్టపరమైన జరిమానాలు విధించి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. అని వారు డిమాండ్ చేశారు.. తమ ఫిర్యాదును ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తీసుకోవాలని వారు అభ్యర్ధించారు.

నిన్న‌టివ‌ర‌కూ ప‌చ్చ‌ద‌నంతో విల‌సిల్లిన ఆ ప్రాంతాల‌న్నీ రానున్న రోజుల్లో అక్ర‌మ నిర్మాణాలతో కాంక్రీటు జంగిల్లా మారిపోతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి, ఈ క‌ట్ట‌డాల్లో నివ‌సించేవారి వ‌ల్ల విడుద‌ల‌య్యే మురుగునీరు ఎక్క‌డికి పోతుంది? ఇప్ప‌టికైనా పుర‌పాల‌క శాఖ మ‌రియు హెచ్ఎండీఏ అధికారులు ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాల్లో ఈ అక్ర‌మ నిర్మాణాలకు అడ్డుక‌ట్ట వేయాలి. మరి దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తారా..? అక్రమ నిర్మాణాలను అడ్డుకంటారా..? 111 జీఓను కాపాడతారా..? అన్నది ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News