- సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు బిజినెస్ కౌన్సిల్ భేటీలో మంత్రి లోకేశ్ వివరణ
ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గ మార్చి, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజు మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా గడిపారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మెల్ బోర్న్లో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని తెలిపారు. భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధప్రదేశ్ను పరిగణించాలని కోరారు.

ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందన్నారు. రాష్ట్రంలో తాము చేపట్టిన పనులు పూర్తిచేయాలనే దృఢసంకల్పంతో ఉన్నామని, ఆయా ప్రాజెక్ట్లకు సంబంధించిన అధికారులు, నాయకులతో నిరంతరం ప్రాజెక్ట్ పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తామని వెల్లడించారు. తమది జాతీయ దృక్పథం కలిగి ఉన్న పార్టీ అని, దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా తాము ఎప్పుడూ జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపామని వివరించారు. ఆంధప్రదేశ్ను 24 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానపరమైన మార్పులు గుర్తించి, వాటిని అమలుచేసే పనిలో ఉన్నామన్నారు.
