- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎమ్మెల్సీ ఆలపాటి కామెంట్స్..Alapati Rajendra Prasad
- గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలను తీరుస్తున్నాం..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ (Alapati Rajendra Prasad) ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ నాయకత్వం చేస్తున్న విమర్శలు అర్థరహితంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో విద్యా రంగాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేసి, వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లిన వైసీపీ నేతలు.. ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువు పూర్తయినా సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కేవలం విద్యారంగమే కాకుండా సాంకేతిక విద్య, ఆరోగ్యశ్రీ, రైతులు, కాంట్రాక్టర్లు.. ఇలా ప్రతి రంగంలోనూ వైసీపీ వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ తమ అనుకూల వర్గాలకే నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ బకాయిలన్నింటినీ భారం అనుకోకుండా బాధ్యతగా స్వీకరించి దశలవారీగా చెల్లిస్తోందని స్పష్టం చేశారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆలపాటి వివరించారు. విద్యార్థులపై ఎలాంటి మానసిక ఒత్తిడి తీసుకురావద్దని, ఫీజుల విషయంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఫీజు ఫిక్సేషన్ కమిటీ ద్వారా కనీస ఫీజును రూ. 35,000కు తగ్గించి కాలేజీలను వేధించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విద్యాసంస్థల మనుగడను దృష్టిలో ఉంచుకుని సగటు ఫీజును రూ. 45,000కు సవరించిందని వెల్లడించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
