- గర్భస్థ శిశువు మృతికి డాక్టర్లే కారణం,కఠిన చర్యలు తీసుకోవాలి
- ఏఐటీయూసీ నాయకుల డిమాండ్..
గోదావరిఖని,లో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.సరైన వైద్యం అందించడంలో వైఫల్యం చెందిన గైనకాలజిస్ట్‌తో పాటు ఇతర డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు డిమాండ్ చేశారు.నేడు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మడ్డి ఎల్లా గౌడ్ మాట్లాడుతూ..డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వల్లే గర్భస్థ శిశువు మరణించిందని ఆరోపించారు.
డ్యూటీ డాక్టర్లు కనీసం పరీక్షించకుండా నిర్లక్ష్యం వహించడం విచారకరమన్నారు.అంతేకాక,లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాలు నిపుణులు లేకపోవడం వల్ల మూలనపడి నిరుపయోగంగా మారాయని, దీని కారణంగానే గర్భిణులను ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు పంపాల్సి వచ్చిందని,ఇది కూడా శిశువు మరణానికి ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, సంస్థ లాభాలను కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రభుత్వానికి దారాదత్తం చేస్తోందని ఆరోపించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, గర్భస్థ శిశువు మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే నిరుపయోగంగా ఉన్న వైద్య పరికరాలను ఉపయోగించేందుకు తక్షణమే నిపుణులను నియమించాలని ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో దాసరి శ్రీనివాస్,అటికేటి రాజు తదితరులు పాల్గొన్నారు.
