- రేపటి నుంచే పెరిగిన చార్జీలు అమలు..
- చమురు సంక్షోభమే పెరుగుదలకు కారణం..
చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఏప్రిల్ 8, బుధవారం నుంచే టిక్కెట్ల ఛార్జీల పెంపు నిర్ణయం అమలులోకి రానుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్తోపాటు, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ టిక్కెట్ల ఛార్జీలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతానికి కొన్ని ఇంటర్నేషనల్ రూట్లలో మాత్రం ఛార్జీల పెంపు ఉండబోతుంది.. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. హార్ముజ్ జలసంధి మూసివేయడం, ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు జరగడం కారణంగా చమురు లభ్యత తగ్గి, ధరలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్లపై విధించే ఫ్యూయల్ ఛార్జీలు కనిష్టంగా రూ.299 నుంచి గరిష్టంగా రూ.899కి పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ప్రస్తుతం యుద్ధం కారణంగా ముడి చమురు ధర భారీగా పెరిగింది. విమాన ఇంధన ధరలు కూడా రెట్టింపయ్యాయి. బ్యారెల్ విమాన ఇంధన ధర ఫిబ్రవరిలో 99.40 డాలర్లు ఉండగా, గతవారం 195.19 డాలర్లు ఉంది. ఎయిర్ ఇండియా తాజా నిర్ణయం ప్రకారం నేరుగా టిక్కెట్ల ధరలు కాకుండా ఇంధన సర్ ఛార్జీలు మాత్రమే పెరుగుతాయి. గతంలో ఈ విషయంలో ఫ్లాట్ ఛార్జీలు విధించేవారు. ఇప్పుడు దూరాన్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు.
