- ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డులు అందించాలి…!
- ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో జిల్లా ప్రతినిధి సిహెచ్. రాజయ్య డిమాండ్..!
తాడ్వాయి: తాడ్వాయి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ వైద్యులపై (ఆర్ఎంపీ, పీఎంపీ) తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TGMC) జరుపుతున్న దాడులను(TGMC Raids) తక్షణమే నిలిపివేయాలని ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్. రాజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తాడ్వాయి మండలం లోని కృష్ణాజివాడి గ్రామంలో జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులపై దాడులు చేస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీయడం తగదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ ఇప్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కనీసం వారికి పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు కూడా అందించకపోవడం బాధాకరమన్నారు.

కనీసం ఇప్పటికైనా విద్యార్హత కలిగిన వారికి ప్రభుత్వమే ‘కమ్యూనిటీ పారామెడికల్’ శిక్షణ ఇప్పించి, పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఉత్తీర్ణులైన వారికి గుర్తింపు ఇచ్చి, జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామీణ వైద్యుల బతుకులు భారమై, ఆత్మహత్యలే శరణ్యమయ్యే ప్రమాదం ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మానేటి, సంఘం కార్యదర్శి ఎల్. దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మ శంకర్, బీబీపేట్ మండల కార్యదర్శి తుమ్మ రవీందర్, సిరిసిల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్. నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
