Homeఆదాబ్ ప్రత్యేకంJawahar Nagar | బోర్డు పీకేశారు.. భూమిని మింగేశారు!

Jawahar Nagar | బోర్డు పీకేశారు.. భూమిని మింగేశారు!

  • జవహర్‌నగర్‌లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
  • స.నెం. 337, 338లో సుమారు రెండెకరాల ప్రభుత్వ స్థలం
  • గతంలో ప్రభుత్వ భూమిగా సూచిక బోర్డు ఏర్పాటు
  • ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలం కబ్జా
  • కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి
  • అధికార పార్టీ నేతల అండతోనే కబ్జాలుంటూ ఆరోపణలు

పేదోడు 60 గజాల్లో రేకుల షెడ్డు వేసుకున్నా అక్రమ నిర్మాణమంటూ జేసీబీలతో కూల్చివేసే అధికారులు.. రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు? పేదల గుడిసెలపై ప్రతాపం.. పెద్దల అక్రమ నిర్మాణాలపై ఉదాసీనత.. ఇదేనా అధికారుల న్యాయం? మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్(Jawahar Nagar) బి.జె.ఆర్. నగర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ అధికారులు గతంలో ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేసిన స్థలంలోనే నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్: పేదవాడు తన కుటుంబానికి ఒక చిన్న ఆసరాగా ఉండాలని 60 గజాల స్థలంలో రేకుల షెడ్డు వేసుకుంటే చాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భూకంపం సృష్టించినట్లు హుటాహుటిన వాలిపోతారు. “ఇది అక్రమ నిర్మాణం” అంటూ జేసీబీలతో కూల్చివేసి, నిరుపేదలను భయభ్రాంతులకు గురిచేస్తారు. మరి అదే నిబంధనలు, అదే చట్టాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి భవనాలు లేపుతున్న బడా బాబులకు వర్తించవా? ముడుపుల మత్తులో జోగుతున్న అధికారులకు ఈ అక్రమాలు కనిపించడం లేదా? మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్(Jawahar Nagar Municipality) కార్పొరేషన్ పరిధిలోని బి.జె.ఆర్. నగర్ కాలనీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

బోర్డులు మాయం.. అక్రమ నిర్మాణాలు మయం!

బి.జె.ఆర్. నగర్‌లోని సర్వే నంబర్లు 337, 338 పరిధిలో సుమారు 2 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలం ప్రభుత్వానిదేనని గతంలో రెవెన్యూ అధికారులే స్వయంగా స్పష్టతనిచ్చి సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే, కాలక్రమేణా ఆ బోర్డు మాయమైంది. రాత్రికి రాత్రే అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు కన్నుమూసి కూర్చోవడం విస్మయానికి గురిచేస్తోంది.

ఒకప్పటి జర్నలిస్ట్ ముసుగులో కబ్జా పర్వం!

ఈ కబ్జా వెనుక పెద్ద తంతే నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేసిన ఒక వ్యక్తి, ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని, ఇప్పుడు సంస్థతో సంబంధాలు లేకపోయినా.. అధికార పార్టీ నేతల అండదండలు, రెవెన్యూ అధికారుల కుమ్మక్కుతో యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆ సంస్థ అతన్ని అప్పటికే తొలగించినప్పటికీ, తనకున్న పలుకుబడిని అడ్డంపెట్టి కోట్ల విలువైన భూమిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాడని కాలనీవాసులు మండిపడుతున్నారు.

ప్రజా అవసరాల స్థలాన్ని మింగేస్తారా?

ఈ ఖాళీ స్థలాన్ని భవిష్యత్తులో స్థానిక ప్రజల అవసరాల కోసం చిల్డ్రన్స్ పార్క్, బస్తీ దవాఖానా లేదా ప్రభుత్వ పాఠశాలగా ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీవాసులు గతంలో అనేకసార్లు అధికారులకు విన్నవించారు. పేద ప్రజల ఆరోగ్యం, పిల్లల చదువుల కోసం ఉపయోగపడాల్సిన ఈ విలువైన స్థలం కొద్దిమంది స్వార్థపరులపాలవుతుంటే అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? భూకబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, వారికి అండగా మారుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

స్థానికుల ఆగ్రహం.. తక్షణ స్పందనకు డిమాండ్

పేదోడి గుడిసెపై ప్రతాపం చూపే అధికారులు, బడా బాబులు ముడుపులు ముట్టచెబితే చాలు ప్రభుత్వ భూములను కళ్లప్పగించి చూస్తారా? అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, ప్రభుత్వ భూమికి పకడ్బందీగా హద్దులు నిర్ణయించి, తిరిగి సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని.. ప్రజా ప్రయోజనాల కోసం చిల్డ్రన్స్ పార్క్ లేదా బస్తీ దవాఖానాను నిర్మించాలని బి.జె.ఆర్. నగర్ కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.”అధికారుల నిర్లక్ష్యం, బడా బాబుల ఆక్రమణల పర్వంపై మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News