- ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యం
- గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కొన్ని నిమిషాలు ముందుగా గమ్యస్థానానికి చేరడం కంటే, ప్రతి ప్రయాణికుడిని క్షేమంగా గమ్యస్థానానికి(Road Safety Awareness) చేర్చడమే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ఎంజీబీఎస్‌లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘అరైవ్ అలైవ్ – సురక్షితంగా ప్రయాణిద్దాం.. సురక్షితంగా గమ్యాన్ని చేరుకుందాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, రహదారి సూచికలు, లేన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
బస్సులను నిర్ణీత బస్‌స్టాపుల వద్ద మాత్రమే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, దించుకోవాలని సూచించారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధులకు హాజరయ్యే ముందు తగినంత విశ్రాంతి తీసుకోవడంతోపాటు, బస్సు బ్రేకులు, టైర్లు, లైట్లు తదితర కీలక భాగాల పనితీరును తనిఖీ చేసుకోవాలని సూచించారు.
ప్రతి ప్రయాణికుడి ప్రాణం అమూల్యమైనదని, డ్రైవర్ల అప్రమత్తత, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అనేక ప్రమాదాలను నివారించగలవని అధికారులు వివరించారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని, విలువైన మానవ ప్రాణాలను కాపాడుతామని బస్సు డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-II) సి. వేణుగోపాల్ రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ రఘు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ, రాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘అరైవ్ అలైవ్ – సురక్షిత డ్రైవింగ్.. సురక్షిత ప్రాణాలు’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
