మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై షేక్ బొగ్గుల మౌలాలి రూ.5 లక్షల భారీ విరాళాన్ని(Donation) అందజేశారు. బుధవారం ఆయన తరఫున సోదరుడు షేక్ బొగ్గుల సైదా ఆలయ కమిటీ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సైదాను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన షేక్ బొగ్గుల మౌలాలి తన స్వగ్రామమైన రఘునాథపాలెంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారని తెలిపారు.మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నారని కొనియాడారు.
కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో మిగిలిన నిర్మాణ పనుల కోసం ఆర్థిక సహాయం కోరగానే మౌలాలి వెంటనే స్పందించి రూ.5 లక్షల విరాళాన్ని(Donation) ప్రకటించడం పట్ల అయ్యప్ప భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తన తల్లిదండ్రులు షేక్ బొగ్గుల జాన్ సాహెబ్, లతీఫ్ బీ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందించడం విశేషం.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య,ఉప సర్పంచ్ కొత్తపల్లి శౌరి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బానోతు బాబు నాయక్,మఠంపల్లి మాజీ సర్పంచ్ ఆదూరి కిషోర్ రెడ్డి,మండల మాజీ ఎంపీపీ బుచ్చయ్య,మహేష్ గౌడ్,రణబోతు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కర్నె వెంకటేశ్వర్లు,వీర బాబు,కమిటీ సభ్యులు,అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
