- ప్రగల్భాలకే పరిమితమైన అధికారుల హెచ్చరికలు..?
- కరడ్ పల్లిలో కౌలు రైతుకు భారీ నష్టం: నాలుగున్నర ఎకరాల్లో వేసిన మొక్కలో కంకులు ఎక్కువ.. గింజలు తక్కువ .
తాడ్వాయి: నకిలీ విత్తనాలపై(Fake Seeds) ఉక్కుపాదం మోపుతాం… రైతులను మోసం చేసే డీలర్లను, కంపెనీలపై కేసులు నమోదు చేస్తాం… అంటూ పాలకులు, అధికారులు చేసే ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ విత్తనాల(Fake Seeds) దందా పల్లెల్లో రైతన్నల బతుకులను ఛిద్రం చేస్తోంది. తాజాగా తాడ్వాయి మండలంలో(Tadwai Mandal) కరడ్ పల్లి గ్రామంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం.
నమ్మించి గొంతు కోశారు!
కరడ్ పల్లి గ్రామానికి చెందిన పిట్ల సంజీవులు అనే కౌలు రైతు నాలుగున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. గత కొన్నేళ్లుగా అతను గాంధారి మండల కేంద్రానికి చెందిన ఒక డీలర్ వద్ద ‘సింజెంటా ఎన్కే 30’ రకం విత్తనాలను కొని వాడుతూ మంచి దిగుబడులు సాధించాడు. ఈ ఏడాది కూడా అవే విత్తనాల కోసం వెళ్లగా, ఆ రకం మార్కెట్లో బంద్ అయిందని, దానికి బదులుగా మార్కెట్లోకి వచ్చిన ఎన్ కె’6560′ రకం విత్తనాలు వేస్తే బంపర్ దిగుబడి వస్తుందని వ్యాపారులు నమ్మబలికారు. డీలర్ మాటలు నమ్మిన సంజీవులు , బస్తాకు రూ. 1,200 చొప్పున 9 బస్తాల విత్తనాలు కొనుగోలు చేసి నాలుగున్నర ఎకరాల్లో నాటాడు.

కంకులు ఉన్నాయి…
గింజలు లేవు!
పైరు ఏపుగా పెరిగినప్పటికీ, పంట చేతికొచ్చే దశలో రైతుకు తీవ్ర నిరాశే మిగిలింది. ఒక్కో మొక్కకు మూడు నుంచి నాలుగు కంకులు వచ్చినప్పటికీ, వాటిలో పాలు పోసుకుని గింజ (గింజ కట్టడం) కట్టలేదు. మొక్క బుట్టలుగా మారింది తప్ప గింజలు పెట్టకపోవడంతో రైతు ఆశలను అడియాసలు చేశాయి. ఒక్కో మొక్కకు ఇన్ని కంకులు వస్తే మొక్కకు బలం ఎలా సరిపోతుందని, నాసిరకం, కల్తీ విత్తనాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.

తీరని నష్టం… అప్పుల ఊబిలోకి..!
గత ఏడాది ఇదే భూమిలో 128 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కౌలు డబ్బులు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు అన్నీ కలిపి ఇప్పటికి లక్ష రూపాయలకు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టానని, బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను నిండా ముంచిన సదరు సీడ్స్ కంపెనీతో పాటు డీలర్‌పై వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని సాయిలు డిమాండ్ చేస్తున్నాడు.

అధికారులు నిద్ర వీడేదెప్పుడు..?
మండలంలో నకిలీ విత్తనాల బెడదతో అనేకమంది రైతులు మోసపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. విత్తన కంపెనీలు, లైసెన్స్ లేని డీలర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతు పొలాన్ని పరిశీలించి పరిహారం అందించడంతో పాటు, నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీ, స్థానిక డీలర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
తనకు నష్టపరిహారం చెల్లించాలి. రైతు పిట్ల సంజీవులు
తాను నాలుగున్నర ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సిన్జెంటా ఎంకే “6560” అనే రకం విత్తనాలను పంట వేశాను. మొక్క బాగా పెరిగింది కానీ కొన్ని మొక్కలు మూడు నుంచి నాలుగు బుట్టలు పెట్టి గింజలు మాత్రం పెట్టలేవు. ఈ విషయమై కంపెనీ వారికి ఫిర్యాదు ఒకసారి వచ్చి చూసి వెళ్లారు తర్వాత వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. తాను ఇప్పటికే లక్షలు పైగా పెట్టుబడి పెట్టాను. అధికారులు స్పందించి సదరు విత్తన కమిటీ నుండి తనకు నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఉన్నతాధికారులకు నివేదికలు పంపాము. తాడ్వాయి ఏవో నర్సింలు.
కరడ్ పల్లి గ్రామానికి చెందిన రైతు పిట్ల సంజీవులు మొక్కజొన్న పంటను పరిశీలించాము. కొన్ని మొక్కలు ఎక్కువ కంకులు పెట్టి తక్కువ గింజలు ఉండటాన్ని గ్రహించాము. ఈ విషయమే పై ఉన్నతాధికారులకు నివేదిక పంపాము. వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పంటను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటాము.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
